హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదుచేశారు. మంగళవారం సాయంత్రం విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు జారీ చేయగా వారు రాలేదు. వారి తరఫున శేఖర్‌బాషా అనే వ్యక్తిని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపించి తమకు కొంత సమయం కావాలని కోరినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో పోలీసులు మూడు రోజుల్లో విచారణకు రావాలని చెప్పినట్టు సమాచారం. అలాగే, బెట్టింగ్ ఇన్ఫ్లూయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టిసారించింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు పంజాగుట్ట పోలీసుల నుంచి వివరాలు తెప్పించుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా హవాలా రూపంలో ఇన్ఫ్లూయెన్సర్లకు నగదు చెల్లింపులు జరిగినట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. బెట్టింగ్యాప్స్ వ్యవహారంపై మరికొందరు సెలబ్రిటీలపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నది.