హైదరాబాద్; మే 26 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ శాస్త్ర, సాంకేతిక మండలి (టీఎస్కాస్ట్) ఆధ్వర్యంలో వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జవహర్లాల్ నెహ్రూ ఆరిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సహకారంతో ఈ సెల్‌ను ఏర్పాటుచేస్తామని వివరించారు.
గురువారం ఆయన టీఎస్కాస్ట్ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తం 8 క్లస్టర్లను ఎంపిక చేసినట్టు తెలిపారు. మొదటి సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం, రెండో సంవత్సరంలో వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తగిన శిక్షణ, మూడో సంవత్సరంలో శాస్త్ర, సాంకేతిక ఆధారిత యంత్రాలు, పరికరాలను అందజేస్తామని పేరొన్నారు. టీస్ కాస్ట్ ఆధ్వర్యంలో రూ.14.51 కోట్లతో ఎస్సీ, ఎస్టీ సెల్‌తో సహా వినూత్నంగా 7 ప్రాజెక్ట్‌లను అమలు చేస్తున్నట్టు వివరించారు. వాటిలో వరంగల్‌లోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఇన్నోవేషన్ హబ్, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ కింద సిల్ డెవలప్మెంట్, నేషనల్ సైన్స్‌డే, నేషనల్ మ్యాథమాటిక్స్ డే వేడుకల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.
నిర్మల్‌లో సైన్స్ సెంటర్, ప్లానెటోరియం ఏర్పాటుకు రూ.42.41 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రూ 2.88 కోట్లతో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూహెచ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, శ్రీకొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీల్లో పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (పీఐసీ) ఏర్పాటుకూ ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ పర్యవేక్షణలో టీఎస్కాస్ట్ మెరుగైన ప్రగతి సాధించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. టీఎస్కాస్ట్ సభ్య కార్యదర్శి మారుపాక నగేశ్, ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.