Indiramma Indlu | హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): నగరాలు, పట్ణణాల్లో సొంత స్థలాలు లేని నిరుపేదలకు తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షేనా? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుపేదల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తొలి దశలో సొంత జాగ ఉంటేనే ఇల్లు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేయడమే అందుకు కారణంగా తెలుస్తున్నది.
మలి విడతల్లోనైనా వారికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందా? అన్న అనుమానాలకు సర్కారు వద్ద సమాధానమే లేదు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లో మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు సొంత జాగలు లేవు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 లక్షలకు పైగా ఇండ్ల మంజూరు కోసం దరఖాస్తులు అందాయి. వాటిలో 90 శాతం మంది సొంత జాగ లేనివారే ఉన్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం కనిపిస్తున్నది.
ప్రజాపాలన దరఖాస్తుల్లో సుమారు 82 లక్షల వరకు దరఖాస్తుదారులు ఇల్లు కోసమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు సగంమంది హైదరాబాద్ సహా పట్టణాల్లో నివసిస్తున్న పేదలు ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం తొలి దశలో భాగంగా 4.5 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని సర్కారు సంకల్పించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న జాగ లేని పేదలకు తొలి దశలో ఇల్లు మంజూరయ్యే ఆస్కారం లేకుండా పోయింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న పేదల గృహనిర్మాణానికి సంబంధించి సహజంగా పట్టణ ప్రాంతాల్లో గ్రూప్ హౌసింగ్ స్కీమ్‌లను అమలుచేస్తారు. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం, బీఆర్ఎస్ హయాం లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ జాగల్లో గుడిసెలు నిర్మించుకొని ఉంటున్న వారిని ఖాళీ చేయించి అక్కడే వారికోసం అపార్ట్మెంట్లు (ఇన్ సిటూ పద్ధతి) నిర్మించడం ఆనవాయితీ. లేనిపక్షంలో ప్రభుత్వ స్థలంలోనే అపార్ట్మెంట్లు నిర్మించి వారికి కేటాయిస్తారు.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇండ్ల కేటాయింపుపై స్పష్టత లేదు. కేవలం జాగ ఉన్నవారికే ఇండ్లు కేటాయిస్తామని పేర్కొనడంతో పట్టణ పేదలకు ఇండ్లు దక్కే వీలులేదని అధికారవర్గాలూ స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఎవరికైనా ఖాళీ జాగ ఉన్నప్పటికీ వాటికి సరైన పత్రాలు ఉండటం లేదు. పత్రాలున్నా ఇంటి నిర్మాణంలో నిబంధనలు, షరతులు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అతితక్కువ జాగలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోవడం సాధ్యంకాదని వారు తేల్చి చెప్తున్నారు.
గ్రేటర్ పరిధిలో చాలామంది లేఔట్లలో ఇండ్ల స్థలాలు కొన్నవారే ఉన్నారు. చాలామందికి వారసత్వంగా వచ్చిన స్థలాలు ఉన్నాయి. వాటి విలువ నేడు రూ.కోట్లలో ఉంది. అయినా వారు ఇల్లు నిర్మించుకునే స్థితిలో లేరు. అటువంటివారు ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనలకు లోబడి ఇల్లు మంజూరు చేస్తామని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంటి జాగ పత్రాలు క్లియర్‌గా ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇల్లు మంజూరవుతుందని, జాగ విలువతో సంబంధం లేకుండా వారి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని ఇల్లు మంజూరు చేస్తామని వారు పేర్కొంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో సొంత జాగలేని పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు, తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉన్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ తొలి విడతలోని మంజూరయ్యే ఇండ్లల్లో పట్టణ పేదలకు కేటాయించాలని భావిస్తే ప్రత్యేక ఉత్తర్వులు తప్పనిసరని పేర్కొంటున్నారు. అప్పటివరకు వారికి ఇల్లు మంజూరయ్యే వీలు లేదని స్పష్టంచేస్తున్నారు.