హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాలకు వలసవెళ్లిన వారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కారణంగా ఇందిరమ్మ ఇండ్లను పొందే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే ఇల్లు మంజూరవుతుంది. పట్టణాల్లో ఉంటూ ఆధార్ కార్డులో చిరునామా ప్రకారం సొంత ఊర్లో ఇల్లు పొందాలనుకున్నా గ్రామసభ అభ్యంతరం చెబితే ఇల్లు మంజూరయ్యే వీలులేదు. ఈ మేరకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటుదక్కకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను మూడంచల్లో వడపోస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ కార్డు ద్వారా దరఖాస్తుదారుల పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉండడంతో ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా ఇట్టే గుర్తించే అవకాశం ఉంది. గ్రామంలో ఇంటి జాగా ఉండి, ఆధార్ కార్డులో పట్టణం చిరునామా ఉన్నా ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ప్రజలు జిల్లాలనుంచి ప్రధాన పట్టణాలకు, హైదరాబాద్కు వచ్చి జీవిస్తున్నారు. వృత్తి-ఉద్యోగాల కోసం, కూలీ పనులకోసం వచ్చి, అద్దె ఇండ్లలో ఉంటూ.. పిల్లల చదువు కోసం ఇక్కడి చిరునామాపైనే ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇటువంటివారు ఇప్పుడు సొంత ఊళ్లలో ఇల్లు పొందే అర్హతను కోల్పోతున్నారు. వారికి ఎలాగూ హైదరాబాద్లో ఇంటి జాగా లేకపోగా సొంత ఊళ్లో కూడా ఇల్లు లభించే వీలు లేకుండా పోతున్నది. దీంతో వీరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.
సగం కూడా పూర్తి కాని దరఖాస్తుల పరిశీలన
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇండ్ల కోసం 82 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా, వాటిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తికాలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని చేపడుతున్నందున కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఇందులో సోషియో-ఎకనమిక్ క్యాస్ట్ సర్వేతోపాటు ఇంటింటి సర్వే, గ్రామసభల ఆమోదం తప్పనిసరి. ఇల్లు లేని ఉన్నవారు, రెండు గదులలోపు కచ్చా ఇల్లు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఇంటింటి సర్వే ద్వారా దరఖాస్తుదారులు ఉంటున్న ఇల్లును పరిశీలిస్తారు. వారి ఆధార్ కార్డు ఆధారంగా వారి వివరాలను ధ్రువపరుచుకుంటారు. ఆధార్ కార్డు ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు తదితర వివరాలన్నీ వెల్లడవుతాయి. దీంతో ఏ విధంగానూ తప్పుడు సమాచారం ద్వారా ఇందిరమ్మ ఇల్లు పొందే ఆస్కారం లేదని అధికారులు చెప్తున్నారు.
సగానికిపైగా బుట్టదాఖలే!
ఇంటి లబ్ధిదారుల ఎంపికకోసం విధించిన నిబంధనల వల్ల సగానికిపైగా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులే అంటున్నారు. పూర్తిగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు తప్ప.. హైదరాబాద్ వంటి నగరాల్లో కూలి పనులు చేసుకొని బతుకున్నవారికి కూడా ఇల్లు లభించే వీలు లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కూలి పనిచేసినా కుటుంబ ఆదాయం నెలకు రూ. 30వేలు దాటుతుందని, అందులో వారు ఎంతోకొంత పొదుపు చేసుకున్నా ఆ వివరాలన్నీ ఆధార్ కార్డు ద్వారా వెల్లడవుతాయని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో నిర్మించే ఇండ్లకు రూ.1.2 లక్షలు, కొండ ప్రాంతాలు, నార్త్-ఈస్ట్ రాష్ర్టాల్లో 1.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఇలా…