హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల ఎంపికలో నిజాయతీ, సచ్ఛీలతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నైపుణ్యాలు లేకుంటే శిక్షణ ద్వారా అధిగమించొచ్చని.. కానీ సచ్ఛీలత లోపిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించలేమని తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల కాన్ఫరెన్స్‌ను శుక్రవారం రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిజాయతీ, చిత్తశుద్ధి విషయాల్లో కమిషన్లు అస్సలు రాజీపడొద్దని సూచించారు.
‘నిజాయతీ, సమగ్రత చాలా ముఖ్యమైనవి. అభ్యర్థుల నైతిక ధోరణిని అర్థం చేసుకునేందుకు సహాయపడే సాధనాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అన్వేషించాలి’ అని ఉద్బోధించారు. సాంకేతిక సవాళ్లను అధిగమించడం, పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు కమిషన్లు పాటుపడాలని దిశానిర్దేశం చేశారు. అవకాశాల్లో, సమానత్వ ఆదర్శాన్ని అనుసరించడమే కాకుండా ఫలితాల్లోనూ సమానత్వ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. లింగ సమానత్వాన్ని సర్వీస్ కమిషన్లు అధిక ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతలో అణగారిన, బలహీనవర్గాల కోసం పని చేయాలన్న ఆసక్తి ఉండాలని చెప్పారు. మహిళల అవసరాలు, ఆకాంక్షల పట్ల ఉద్యోగులు సునిశితంగా వ్యవహరించాలని నిర్దేశించారు. కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, యూపీఎస్సీ చైర్మన్ అజయ్‌కుమార్, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. జాతీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల రెండు రోజుల సదస్సు నేడు (శనివారం) కొనసాగనుంది.