లక్ష్యాన్ని అందరూ నిర్దేశించుకుంటారు. కానీ, దాన్ని అందుకునే ప్రయత్నంలో చాలామంది చేతులెత్తేస్తారు. ఈ యువతులు మాత్రం… ఐపీఎస్ (IPS) కావాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యారు. అడుగడుగునా ఓటమి ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. వెనుకడుగు వేయకుండా మరింత కష్టపడ్డారు. ఆడపిల్లలకు పోలీసు ఉద్యోగాలేంటి.. అని ఎందరు ఎన్ని మాటలన్నా లక్ష్య పెట్టలేదు. తోటి యువత సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, ఏఐ నిపుణులుగా, పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నా.. ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వీరిని విజయతీరాలకు చేర్చింది. ఐపీఎస్‌లుగా నిలబెట్టింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ (77వ బ్యాచ్) నుంచి తెలంగాణలోకి అడుగుపెడుతున్న యువ శివంగులతో ‘నమస్తే తెలంగాణ’ ముచ్చటించింది.
జయ శర్మ, ఆంధ్రప్రదేశ్ కేడర్పట్టుదలతో ముందడుగు
మాది రాజస్థాన్. నాన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేసి రిటైర్ అయ్యారు. మేం ఇద్దరం ఆడపిల్లలం. కేంద్ర విద్యాలయ సంఘటన్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను. ఢిల్లీలో మ్యాథ్స్ హానర్స్ చదువుకున్నాను. ఆ తర్వాత జాగ్రఫీలో పీజీ చేశాను. ఐపీఎస్ అవ్వాలనేది నా చిన్ననాటి కోరిక. పోలీసు ఉద్యోగం కోసం చాలా పట్టుదలతో చదివాను. మొత్తానికి 6వ ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. 586 ర్యాంకు కొట్టాను. కొన్నిసార్లు నేను నిరుత్సాహపడినా.. నా పట్టుదలే నన్ను విజయతీరాలకు చేర్చింది. ప్రస్తుతం సైబర్ నేరాలు దారుణంగా జరుగుతున్నాయి. అందులోనూ మహిళలను టార్గెట్‌గా చేసి నేరాలు చేస్తున్నారు. వాటి నియంత్రణకు నా శాయశక్తులా కృషి చేస్తాను. తెలంగాణ చాలా బాగుంది. ఇక్కడి పోలీస్ స్టేషన్ల విజిటింగ్‌కు వెళ్లినప్పుడు చూశాను. చాలా బాగున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల కూడా చాలా మర్యాదగా మాట్లాడారు. హైదరాబాద్ చాలా అందమైన నగరం. ఇక్కడ మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశం నన్నెంతో ఆకర్షించింది. ఇక్కడి ప్రజలు హిందీ, ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. వారితో కమ్యూనికేట్ అవడం చాలా సులువుగా అనిపించింది. నేను తెలంగాణ కేడర్‌కు వచ్చాను కాబట్టి.. కచ్చితంగా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను.. తెలుగు నేర్చుకుంటున్నాను కూడా.
-మనీషా మెహ్రా, తెలంగాణ కేడర్
చిన్ననాటి కల నెరవేరింది..
మాది మధ్యప్రదేశ్‌లోని దేవాస్ గ్రామం. నాన్న ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. అమ్మ వ్యవసాయం చేస్తుంటుంది. నాకొక సోదరి ఉంది. ఆమె డెంటిస్ట్. నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్నాను. చిన్నప్పుడు మేం ఉండే ప్రాంతంలో ఒక మహిళా ఐఏఎస్ అధికారి నేరుగా ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కరించడం చూశాను. మా నాన్న ఆమెతో నన్ను మాట్లాడించారు. చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆమెలా ఐపీఎస్ అవ్వాలనీ, ప్రజలతో మమేకమవ్వాలని, వారికి సేవ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా సివిల్స్ చేయాలని బలంగా కోరుకొని.. దానికోసమే ప్రయత్నం చేశాను. తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. అన్ని రకాలుగా రాటుదేలేలా శిక్షణ కొనసాగింది. సైబర్ సెక్యూరిటీపై దృష్టిపెడతాను. సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఆ నేరాల నియంత్రణకు నావంతుగా ప్రయత్నం చేస్తాను. పోష్, పోక్సో యాక్టుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఆపరేషన్ సిందూర్‌లో ఇద్దరు మహిళలు ముందుండి నడిపిన విధానం నన్ను బాగా ఆకర్షించింది. తెలంగాణ గురించి, ఇక్కడి చరిత్ర గురించి తెలుసుకుంటున్నాను. ఈ పోరాటాల గడ్డపై పనిచేయడం నాకెంతో గర్వకారణం. ప్రజలు చాలా కోఆపరేటివ్‌గా ఉన్నారు.
-అయాషా ఫాతిమా, తెలంగాణ కేడర్
నాన్న వల్లే ఈ స్థాయిలో ఉన్నా..
మాది ఢిల్లీ. నాన్న ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. కెమిస్ట్రీ హానర్స్ చదివాను. ఆ వెంటనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. నాన్న వల్లే నేను ఇక్కడ ఉన్నాను. చిన్ననాటి నుంచి మంచీ చెడూ చెబుతూ, విలువలతో కూడిన జీవితాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. చక్కగా చదివించారు. పట్టు విడవకుండా మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నాన్న నేర్పిన క్రమశిక్షణ నాకు ట్రైనింగ్‌లో బాగా ఉపయోగపడింది. ఉదయాన్నే లేవడం అన్ని యాక్టివిటీలు చేయడం ఆయన వల్లే అబ్బింది. చాలామంది టాపర్స్ సివిల్స్ ఎగ్జామ్స్ చాలా కష్టమని చెప్పారు. దీంతో నేను పథకం ప్రకారం చదివాను. కేవలం ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యంతోనే చదివితే సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎంపికయ్యాను. అయినా నాకు తృప్తి కలగలేదు. దీంతో ఉద్యోగం చేస్తూనే ప్రతిరోజూ 4-5 గంటలు ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. నాకు తెలంగాణ అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్ సార్ చాలా ఇన్స్పిరేషన్. ఇంటర్వ్యూకు ముందు ఆయన కొంత మెంటారింగ్ చేశారు. ఆయన చాలా మంది ఐపీఎస్ స్టూడెంట్స్‌కు హెల్ప్ చేస్తున్నారు. మహిళాల రక్షణ కోసం కృషి చేయాలని అనుకుంటున్నాను. దీంతోపాటు సైబర్ క్రైమ్స్ మీద కూడా దృష్టిసారిస్తాను. ఒక్కసారి ప్రయత్నం మొదలు పెడితే ఎక్కడా ఆగొద్దు. విజయావకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.. అయినా సాధించాలనే పట్టుదల మాత్రం విడవద్దు. గెలిచే వరకూ ఫైట్ చేయడమే.
-కీర్తి యాదవ్, ఏజీఎంయూటీ కేడర్, బెస్ట్ అవుట్డోర్, బెస్ట్ లేడీ ప్రొబిషనర్
అమ్మానాన్నల కష్టం వల్లే..
బిహార్‌లో పాట్నాలోనే పుట్టి పెరిగా. ఆ తర్వాత జార్ఖండ్ వెళ్లి అక్కడే చదువుకున్నా. నాన్న ప్రైవేట్ స్కూల్ టీచర్. అమ్మ గృహిణి. ఐఐటీ గౌహతిలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాను. మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్‌గా ఓలా క్యాబ్స్‌లో చేశాను. నన్ను పోలీసుగా చూడాలని అమ్మానాన్న కోరిక. అందుకే ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోసం కష్టపడ్డాను. ప్రణాళికతో చదువుకుంటూ మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నన్ను చదివించేందుకు చాలా కష్టపడ్డారు. నాకు ఐపీఎస్ వచ్చిందని తెలిసి అమ్మ చాలా భావోద్వేగానికి గురైంది. నాన్నే నాకు ఆదర్శం. ఆయనే నాకు గురువు.. మెంటార్. తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పోలీసింగ్‌లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంది. ఇక్కడి పోలీసులు టెక్పోలీసింగ్లో దూసుకుపోతున్నారు. జార్ఖండ్లాగానే తెలంగాణ కూడా పోరాటాల పురిటిగడ్డ. ఇక్కడ పనిచేయడం ఎవ్వరికైనా గర్వకారణమే.
-రాహుల్‌కాంత్, తెలంగాణ కేడర్
డీఎస్పీ ఉద్యోగం వదులుకొని..
మా నాన్నగారి స్వస్థలం హరియాణా. కానీ, నేను ఢిల్లీలో ఉంటూ చదువుకోవడం వల్ల అదే నా సొంతూరుగా మారిపోయింది. నాన్న ప్రమోద్‌కుమార్ శర్మ హరియాణాలో సివిల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు. అమ్మ నీతుశర్మ గృహిణి. నా సోదరి పీహెచ్డీ చేస్తున్నది. తమ్ముడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్‌లో హానర్స్ చేశాను. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీలో మాస్టర్స్ మ్యాథ్స్ హానర్స్ చదివాను. సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్నాను. మూడేండ్లు దీనిపై ఫోకస్ పెట్టాను. నేను మూడో ప్రయత్నంలో సాధించాను. నాకు ఆంధ్రప్రదేశ్ కేడర్ ఇచ్చారు. ఇక్కడ ట్రైనింగ్ నన్నెంతో మార్చింది. భౌతికంగా చాలా దృఢంగా తయారయ్యాను. తెలుగు ప్రజలు చాలా సున్నిత మనస్కులు. సివిల్స్ సాధించడానికంటే ముందే.. హరియాణాలో డీఎస్పీగా ఉద్యోగం వచ్చింది కానీ వెళ్లలేదు. సివిల్స్ సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. అంతిమంగా అనుకున్న కల నెరవేర్చుకున్నాను.
– జయ శర్మ, ఆంధ్రప్రదేశ్ కేడర్
-రవికుమార్ తోటపల్లి