ఆయన దేశ సరిహద్దుల్లో పనిచేశాడు. భారత ఆర్మీ జవానుగా దేశ రక్షణ కోసం విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందాడు. అంతటితో ఆయన విశ్రమించలేదు. యువకులతో పోటీ పడి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా మరో ఉద్యోగం దక్కించుకున్నాడు. అయినా సంతృప్తి చెందలేదు. తనకు హాబీగా ఉన్న పర్వతారోహణపై దృష్టి సారించాడు. ఇప్పటికే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన 12 పర్వతాలను ఎక్కి రికార్డులు బద్దలు కొట్టాడు. అక్కడితో ఆగిపోలేదు. తన కొడుకులో పర్వతారోహణపై ఉన్న ఆసక్తిని గుర్తించి చదువుకు ఇబ్బంది కలగకుండానే కొడుకుకీ అందులో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఇంకేం.. ఇద్దరూ కలిసి రికార్డులు సృష్టిస్తున్నారు. 12వ పర్వతాన్ని ఎక్కి తండ్రి, 14 ఏళ్ల వయసులోనే పర్వతారోహణ చేసిన కొడుకుగా రికార్డు సృష్టించారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన తండ్రీ కొడుకులు లెంకల మహిపాల్‌రెడ్డి, వివేకానందరెడ్డి. ఇటీవల వారిద్దరూ యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన, రష్యాలోని 5642 మీటర్ల శిఖరం మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ నేపథ్యంలో వారిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
పెద్దపల్లి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు వృత్తి ధర్మాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే మరో వైపు తాను ఎంచుకున్న కలను సాకారం చేసుకునే దిశగా కఠోరంగా శ్రమించి విజయం సాధించాడు. తన కొడుకు ఆసక్తిని సైతం గ్రహించి శిక్షణను అందించి అందరి చేత ఔరా అనిపించుకున్నాడు సెంటినరీకాలనీకి చెందిన లెంకల మహిపాల్‌రెడ్డి. యూరప్ ఖండంలోనే అత్యంత ఎతైన శిఖరాన్ని తండ్రి మహిపాల్‌రెడ్డి, కొడుకు వివేకానందరెడ్డి అధిరోహించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. మహిపాల్‌రెడ్డి ఆర్మీలో పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కరీంనగర్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే మరో వైపు కలను సాకారం చేసుకునేందుకు కఠోర ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా మౌంటెనీరింగ్ విభాగంలో ఆరుణాచల్ ప్రదేశ్‌లో బేసిక్ మౌంటెన్ కోర్సు బీఎంసీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ మౌంటెనీరింగ్ ఎలైడ్ స్పోర్ట్స్, జమ్ము కశ్మీర్‌లోని అడ్వాన్స్ మౌంటెనీరింగ్ కోర్సు జవహర్ ఇనిస్టిట్యూట్ అఫ్ మౌంటెనీరింగ్ వింటర్ స్పోర్ట్స్ పహల్గాంలో కోర్సులను పూర్తి చేశారు.
పర్వతారోహణలో కోర్సులు పూర్తి చేసిన మహిపాల్‌రెడ్డి దాదాపు 12 పర్వతాలను అధిరోహించి రివార్డులు, అవార్డులను సాధించాడు. గిన్నిస్ వరల్డ్రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లాంటి వాటిలో మౌంటైన్ విభాగంలో చోటు సంపాదించుకున్నాడు. 2019 జూన్‌లో మహిపాల్‌రెడ్డి ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో గల 5642 మీటర్ల ఎత్తైన కిలిమాంజారో పర్వతం, ఆగస్టు 8న రష్యాలోని 5642 మీ. ఎత్తైన ఎల్బ్రస్ పర్వతం, 2020లో 8163 మీ. ఎత్తైన నేపాల్‌లోని మనస్లు పర్వతాన్ని ఎక్కాడు. 2023లో హిమాచల్ ప్రదేశ్‌లో గల 5289 మీ. ఫ్రెండ్షిప్, ఉత్తరాఖండ్‌లో గల 2651 మీ. భగీరథి, హిమాచల్ ప్రదేశ్‌లోని 4250 మీ. పటాల్స్ పర్వతాన్ని అధిరోహించాడు. కిలిమాంజారో పర్వతాన్ని రెండోసారి ఎక్కిన సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహిపాల్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
మహిపాల్‌రెడ్డి తనతో పాటు పర్వతారోహణలో 14 సంవత్సరాల వయసున్న తన కొడుకు వివేకానందరెడ్డికి ఉన్న ఆసక్తిని గ్రహించి ఆయనకు గత సంవత్సరం నుంచి శిక్షణ అందించాడు. రెండేళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లోని మౌంట్ పతాల్సు అనే పర్వతాన్ని అధిరోహించేలా శిక్షణ ఇచ్చి తన పర్యవేక్షణలో ఆ పర్వతారోహణ చేశారు. మౌంట్ ఎల్బ్రస్ పర్వతారోహణకు మాస్టర్ వివేకానందకు గత సంవత్సరం నుంచి శారీరక శిక్షణ ఇచ్చారు. వివేకానందారెడ్డి మక్కువను గమనించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్థికసాయం అందించి ప్రోత్సహించారు.
గత నెల 28న యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన రష్యాలోని 5642 మీటర్లు ఉన్న మౌంట్ ఎల్బ్రస్ పర్వతం ఎక్కేందుకు వీరి ప్రయాణం మొదలైంది. వారం రోజులపాటు ప్రయాణం సాగించి ఈ నెల 2న అర్ధరాత్రి 11:30 గంటలకు బేస్ క్యాంపు నుంచి బయలుదేరగా 3న ఉదయం 8.30 గంటలకు పర్వతం పైకి ఎక్కారు. అక్కడ ఇద్దరూ కలిసి ‘సే నో టూ డ్రగ్స్’ బ్యానర్‌ని ఆవిషరించారు. వీరి యాత్ర ప్రారంభం నుంచి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మాస్టర్ వివేకానంద ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లాడు. ఎక్కడా అలసి పోకుండా తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి ఈ పర్వతాన్ని ఎక్కి చరిత్ర సృష్టించారు. తనను గుర్తించి ఆర్థిక సహాయం అందించిన పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డికి తండ్రీకొడుకులు కృతజ్ఞతలు తెలిపారు.
డ్రగ్స్ నివారణ కోసం మహిపాల్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాడు. తాను అధిరోహించిన 12 పర్వతాలపై ‘సే నో టూ డ్రగ్స్’ అనే బ్యానర్‌ను ప్రదర్శిస్తూ యువతకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.