హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): లండన్‌లో భారత హై కమిషన్‌తోపాటు దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాల ఆధ్వర్యంలో భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఇండియా డే వేడుకలు’ ఘనంగా నిర్వహించారు. వేడుకలకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.
భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి జాతీయ జెండా ఆవిష్కరించారు. టాక్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రారంభించారు. యూకే నలుమూలల నుంచి వేలమంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. విక్రమ్ దొరైస్వామి, ఎన్నారై, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, స్థానిక సంస్థల ప్రతినిధులు తెలంగాణ స్టాల్‌ను సందర్శించారు. స్టాల్లో ఏర్పాటుచేసిన జాతీయ నాయకులు, తెలంగాణ ప్రముఖుల చిత్రపటాలకు నివాళులర్పించారు. హైదరాబాద్ బిర్యాని రుచి చూశారు. కార్యక్రమంలో టాక్ కార్యదర్శి రవి రేతినేని, ఉపాధ్యక్షుడు సత్య చిలుముల, సీనియర్ నేత నవీన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు సత్య చిలుముల, వెంకట్‌రెడ్డి, సురేశ్ బుడగం, రవి రేతినేని, స్వాతి, రవి పులుసు, క్రాంతి రేతినేని తదితరులు పాల్గొన్నారు.