మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:11

సిమ్‌స్వాప్‌.. అకౌంట్‌ క్లీన్‌స్వీప్‌!

సిమ్‌స్వాప్‌.. అకౌంట్‌ క్లీన్‌స్వీప్‌!

  • డూప్లికేట్‌ సిమ్‌లతో పెరుగుతున్న నేరాలు
  • కంపెనీ ప్రతినిధుల్లా మాట్లాడి వివరాలు సేకరణ
  • సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి మరో సిమ్‌ తీసుకుంటున్న సైబర్‌ దొంగలు
  • ఓటీపీలతో బ్యాంకుల నుంచి డబ్బులు కాజేస్తున్న వైనం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫోన్‌ జేబులోనే ఉంటుంది.. ఉన్నట్టుండి నెట్‌వర్క్‌ పోతుంది.. కొంతసమయం వరకు పనిచేయదు.. ఈలోగా మరో సిమ్‌ తీసుకున్న సైబర్‌ దొంగలు బ్యాంకు ఖాతా వివరాల్లోకి వెళ్లి డబ్బు కాజేస్తున్నారు. ఇటీవల సిమ్‌ స్వాపింగ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ‘ఈ తరహా కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. దీనిపై అవగాహన కూడా కల్పిస్తున్నాం. సర్వీస్‌ ప్రొవైడర్లతో మాట్లాడి వారినుంచి కూడా ఈ తరహా మోసాలపై అలర్ట్‌ మెసేజ్‌లు ప్రజలకు పంపించేలా చేస్తున్నాం’ అని సైబర్‌ క్రైం ఉన్నతాధికారి ఒకరు చెపుతున్నారు. సైబర్‌ చీటర్స్‌ ఎయిర్‌టెల్‌, జియో.. ఇలా సర్వీస్‌ ప్రొవైడర్లుగా కాల్‌చేస్తారు. 

మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచడానికి, సిగ్నల్స్‌ సక్రమంగా పనిచేసేందుకు వివరాలు అడుగుతారు. ఏకంగా ఆధార్‌, ఇతర కార్డులను ఫొటోతీసి పంపించాలని సూచిస్తారు. వారి మాటలు నమ్మి చెప్పినట్టు చేస్తేచాలు.. ఇక పని మొదలుపెడుతారు. ఇచ్చిన వివరాలకు సంబంధించి జిరాక్స్‌ తీసుకుని సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి మన డాక్యుమెంట్లు ఇచ్చి డూప్లికేట్‌ సిమ్‌కార్డు తీసుకొంటారు. సర్వీస్‌ ప్రొవైడర్లు కూడా వినియోగదారుడి బంధువుగా భావించి డూప్లికేట్‌ సిమ్‌కార్డు ఇవ్వడంతోపాటు పాత సిమ్‌కార్డు (ప్రస్తుతం మీరు వాడేది) బ్లాక్‌ చేస్తారు. అంతే మీ సిమ్‌ పనిచేయకుండా పోతుంది. ఇలా ఉన్నట్టుండి సిమ్‌కార్డు పనిచేయకపోయినా, సిగ్నల్‌ డ్రాప్‌ అయినా అనుమానించాలని పోలీసులు సూచిస్తున్నారు. వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు, సర్వీస్‌ ప్రొవైడర్‌కు సమాచారమివ్వాలని పేర్కొంటున్నారు. వినియోగదారుడు డూప్లికేట్‌ సిమ్‌కార్డుకోసం వస్తే ఒరిజినల్‌ మెయిల్‌ ఐడీ, ఇతర వివరాలు సరిచూడకుండా జారీచేయొద్దని సర్వీస్‌ ప్రొవైడర్లకు సూచించినట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు. 

జాగ్రత్తపడండి ఇలా..

  • ఫోన్‌ నెట్‌వర్క్‌ ఉన్నట్టుండి పోయినా, సిమ్‌కార్డు పనిచేయకపోయినా వెంటనే మరో నంబర్‌ నుంచి సర్వీస్‌ ప్రొవైడర్‌ కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేయాలి. 
  • బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఎస్‌ఎంఎస్‌తోపాటు, ఈ మెయిల్‌కు కూడా అనుసంధానం చేసుకోవడం ఉత్తమం. 
  • బ్యాంకు, ఆన్‌లైన్‌ లావాదేవీలు తరచూ తనిఖీ చేసుకుంటూ ఉండాలి.


logo