Telangana | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో మహిళా అధికారుల శాతం పెరిగిందని, ఇదంతా 33 శాతం రిజర్వేషన్ అమలు వల్లే సాధ్యమైందని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. గురువారం రాష్ట్రంలోని వివిధ పోలీస్ శిక్షణ కాలేజీల్లో కానిస్టేబుళ్ల 4వ దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది. ఆయా శిక్షణ కేంద్రాల్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు వివిధ పోలీస్ ఉన్నతాధికారులు హాజరై కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర పోలీసు అకాడమీలో జరిగిన పరేడ్‌కు డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
స్టేషన్‌కు వచ్చే అన్నివర్గాల ప్రజలకు భరోసా కల్పించడం కోసం గత ప్రభుత్వం రిజర్వేషన్‌ను అమలు చేసిందని చెప్పారు. నాటి నుంచి పోలీస్ శాఖలో మహిళా అధికారుల సంఖ్య పెరిగిందని, గత నోటిఫికేషన్ ద్వారా 8,047 మంది కానిస్టేబుళ్లలో 2,338 మంది మహిళా కానిస్టేబుళ్లు వచ్చారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలోకి 12 వేల మంది కానిస్టేబుళ్లు (బెటాలియన్లతో కలుపుకొని) రావడం విశేషమని తెలిపారు. ఆత్మవిశ్వసంతో పనిచేస్తే ఎక్కడైనా విజయం వరిస్తుందని పోలీసు అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. అనంతరం ప్రతిభ కనబర్చిన క్యాడెట్లకు ట్రోఫీలు, బహుమతులను డీజీపీ ప్రదానం చేశారు.
2022 ఏప్రిల్‌లో కేసీఆర్ హయాంలోనే 16,604 కానిస్టేబుల్, 587 ఎస్సై తత్సమాన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్సై ఉద్యోగాలకు నిరుడు ఆగస్టులోనే నియామకపత్రాలు అందించగా, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అన్ని పరీక్షలు నిర్వహించి.. నిరుడు అక్టోబర్‌లోనే తుది ఫలితాలను విడుదల చేసింది. కోర్టు కేసుల కారణంగా ఆలస్యమై ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 13,444 మందికి నియామక పత్రాలను అందించారు.