హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫైర్ కాల్స్ పెరిగాయని, 2023లో 8,024 ప్రమాదాలు చోటుచేసుకోగా, 2024లో వాటి సంఖ్య 10,261కి పెరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. సోమవారం స్టేట్ ఫైర్ ట్రైనింగ్ అకాడమీలో అమరవీరులకు నివాళులర్పించాలరు.అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించి, అగ్నిప్రమాదాల నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి శుక్రవారం పబ్లిక్ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. నిరుడు జరిగిన ప్రమాదాల్లో మీడియం, చిన్నతరహా ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, వీటిలో 495 మందిని రక్షించినట్టు వెల్లడించారు. వరద ప్రమాదాల్లో 1,767 మందిని, లిఫ్ట్ ప్రమాదాల్లో 40 మందిని కాపాడినట్టు తెలిపారు. 13,949 అవగాహన కార్యక్రమాలు, 157 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు చెప్పారు. 2014 జూన్ నుంచి నేటి వరకు 5,030 మందికి ఫైర్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో వివిధ వస్తువులు, యంత్రసామగ్రితోపాటు భారీ వాహనాలు, మూడు ఫైర్ ఫైటింగ్ రోబోలను కొనుగోలు చేసినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వారం రోజులు పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.