హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రమంతా ఇగం పట్టుకున్నది. రెండుమూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. వాతావరణంలో తేమ పెరగటం, గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుండటంతో చలితీవ్రత పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. రాగల రెండుమూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది. గురువారం ఒకటి రెండు జిల్లాలు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళలో పొగమంచు కురిసింది.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లా కనాయిపల్లిలో 35.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిరుడు ఇదే సమయానికి రాష్ట్ర సాధారణ సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6 డిగ్రీల సెల్సీయస్గా నమోదైంది. ఐదు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సీయస్లోపే నమోదు కావడం గమనార్హం.