హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్నది తెలంగాణ ఆత్మగౌరవ సభ కాదు- ఆత్మవంచన సభ అని తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు విమర్శించారు. అమరవీరుల కుటుంబసభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ, తెలంగాణ యూత్ఫోర్స్తో కలిసి ము నుగోడు సభను అడ్డుకొంటామని హెచ్చరించారు. బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులకు, ఉద్యమకారులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు.
ఈ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బీజేపీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1,386 మంది అమరులు ప్రాణాలు కోల్పోవడానికి బీజేపీ కారణమని ఆరోపించారు. ఎన్డీఏ హయాంలో ఇచ్చిన మూడు రాష్ర్టాలతో పాటు తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసి ఉంటే ఇంతమంది బలిదానాలు చేసుకొనేవారు కాదని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో ఏ ఒక్క అమరవీరుల కుటుంబాన్ని, తెలంగాణ ఉద్యమకారులనైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలను కాకినాడ తీర్మానం పేరుతో మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ఈ నెల 25న తలపెట్టిన తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన యాత్ర ద్వారా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ యూత్‌ఫోర్స్, తెలంగాణ దళిత సంఘాల జేఏసీల రాష్ట్ర అధ్యక్షులు ఎమ్ రఘుమారెడ్డి, బింగి రాములు, గాలి రవీందర్ లేఖ రాసిన వారిలో ఉన్నారు.