స్టేషన్ ఘనపూర్, డిసెంబర్ 31 : వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం ఏరోజుకు ఆరోజు బతుకు దెరువు కోసం పోరాడే చిరు వ్యాపారులు వాళ్లు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ వన దేవతల జాతరే(Mini Medaram) వారి పాలిట ఇబ్బందికరంగా మారింది. రెండేళ్లకోసారి ప్రకృతి మధ్యన ఆహ్లాదకర వాతావరణంలో పంచభూతాల సాక్షిగా సమ్మక్క-సారలమ్మలను కుటుంబమంతా ఆ వనదేవతలను దర్శించుకుని వారికి ఇష్టమైన బంగారం (బెల్లం) సమర్పిస్తారు.
ఎదురుకోళ్లను ఎగరవేసి తమ కష్టాలు కడతేర్చు తల్లి అంటూ కోట్లాదిమంది భక్తులు ఖర్చులను, కష్టాలను మరిచి ఆ వన దేవతలను వేడుకొని సంతోషంగా పండుగ జరుపుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మినీ మేడారాలు జాతర జరిగే పరిసర గ్రామాలలోని ప్రజలు మాత్రం ఈ జాతర వస్తుందంటేనే వారిలో ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. ఈ జాతర ఎప్పుడు ముగుస్తుందోనని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఏ పండుగ వచ్చినా చిరు వ్యాపారులు పండుగ పేరుపై ఎంతో కొంత సంపాదించుకుంటారు.
టెండర్లతో ఉపాధి కోల్పుతున్న వైనం..
కానీ ఈ జాతర పేరుతో గ్రామాలలోని వివిధ పార్టీలు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వనదేవతల మొక్కులు తీర్చుకునే బంగారం (బెల్లం), కొబ్బరికాయలు, కోళ్లతో పాటు మద్యం టెండర్లు నిర్వహిస్తారు. దీంతో టెండర్లు దక్కించుకున్న వారు మాత్రమే సుమారు నెల రోజులకు పైగా జాతరలోనే కాకుండా గ్రామాలలో కూడా వారు మాత్రమే వాటిని విక్రయించాలి. చిరు వ్యాపారులు బెల్లం, కొబ్బరికాయలు, కోళ్లు, మద్యం అమ్మడానికి వీలు ఉండదు. దీంతో చిరు వ్యాపారాలు నెల రోజులకు పైగా తమ ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
వృద్ధులు, దివ్యాంగులు ప్రతి గ్రామంలో సుమారు పదికి పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తుండగా కిరాణా షాపు, చికెన్ సెంటర్లు వంటి చిరు వ్యాపారులు ( కిరాణం షాపులు) నడుపుకుంటూ పిల్లలను చదివించుకుంటూ, బీపీ, షుగర్ వంటి అనేక వ్యాధులకు నెలకు వేలల్లో ఖర్చు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ టెండర్ల ద్వారా ఆ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి, రోజువారి ఖర్చుల తోపాటు రోగాలకు మందులు ఎలా అని ఆలోచన చేస్తూనే..తాము కూడా పండుగను ఎలా జరుపుకోవాలని సతమామమవుతున్నారు.
జాతర మద్యం షాపులకు అనుమతులిచ్చేదెవరు?
గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు కుటుంబానికి పెద్ద దిక్కు లేక జీవనోపాధి కరువై గ్రామాల్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారిపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేస్తుంటారు. కానీ, జాతర టెండర్ల పేరుతో గ్రామంలో జాతర పరిసరాలలో ప్రభుత్వ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోట్ల విలువైన మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై సంబంధించిన శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతరలోని మద్యం షాపులలో కల్తీ మద్యం అమ్మినా, ఇతర మండలాలను మద్యం తెచ్చినా, అధిక ధరలకు అమ్మకాలు చేపట్టిన ఏ అధికారి మాత్రం పట్టించుకోరు.
గ్రామాల్లోని ఆంక్షలు పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి..
జాతర పేరుతో గ్రామాలలో టెండర్లు పిలిచి, టెండర్లు దక్కించుకున్న వారు మాత్రమే నెలరోజులకు పైగా బెల్లం, కొబ్బరికాయలు, మద్యం, కోళ్లు అమ్ముకునేలా గ్రామాల్లో పెట్టే ఆంక్షలు పై జిల్లా కలెక్ట చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు మాత్రమే జాతర పరిసరాల్లో వాటిని అమ్ముకునేలా చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు.
పదిమంది పొట్ట కొట్టి ఒకరికి పెట్టమని ఏ దేవుడు కూడా చెప్పడని, జాతర పేరుతో తమ గ్రామాల్లో అదే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగలంటేనే ఆదాయం, ఖర్చు రెండు ఉంటాయి కానీ, టెండర్ల పేరుతో తమకు ఉపాధి లేక ఆధాయం కోల్పోవడంతో, ఖర్చులను భరించడం కష్టంగా ఉంటుందన్నారు. పండుగల పేరుతో అప్పులు చేసి సంతోషాన్ని పొందాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
