రాజకీయాల్లో నేరుగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోను. కానీ అవమానిస్తే మాత్రం సహించలేను. బీజేపీలో నన్ను, నా కుమారుడిని కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. అందుకే వేదన నిండిన హృదయంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. త్వరలో ఓ జాతీయ పార్టీలో చేరబోతున్నాను.
-మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బుధవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ సైతం పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వారు లేఖ రాశారు. వారిరువురూ ఈ నెల 27న భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన గిరిధర్, శిశిర్.. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. వారితోపాటు ఒడిశా మాజీ ఎంపీ జయరాం పాంగి కూడా ఈ నెల 27న బీఆర్ఎస్లో చేరనున్నారు. బుధవారం బీజేపీకి రాజీనామా చేసిన గిరిధర్ గమాంగ్.. భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామా వెనుక ఉన్న కారణాలను వివరించారు.
తమకు బీజేపీలో తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘రాజకీయాల్లో నేరుగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోను. కానీ అవమానిస్తే మాత్రం సహించలేను. బీజేపీలో నన్ను, నా కుమారుడిని కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నాను. వేదన నిండిన హృదయంతో బీజేపీని వీడుతున్నాను’ అని గిరిధర్ గమాంగ్ ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే తాను మరో జాతీయ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. అక్కడ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని చెప్పారు. కాగా, జేపీ నడ్డాకు రాజీనామా లేఖలో.. తాను 2015లో స్వచ్ఛందంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానని గిరిధర్ గమాంగ్ పేర్కొన్నారు. 1999లో తన ఓటు వల్ల జరిగిన రాజకీయ పరిణామాలపై వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని రోజులుగా ఒడిశా ప్రజలకు తాను రాజకీయంగా, సామాజికంగా, నైతికంగా అండగా నిలువలేకపోతున్నట్టు భావిస్తున్నానని, అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
బీజేపీలో తమకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావని శిశిర్ గమాంగ్ చెప్పారు. పలుమార్లు పార్టీ సమావేశాలకు సంబంధించిన సమాచారం తమకు ఆలస్యంగా ఇచ్చేవారని, దీంతో మీటింగులకు హాజరుకాని పరిస్థితి ఉండేదని అన్నారు. తాము పార్టీలో చేరినప్పుడు తనకు ఎంపీ టికెట్ ఇస్తానని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారని, కానీ గునుపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ మాత్రమే ఇచ్చారన్నారు. పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం వల్లే తాను ఓటమిపాలయ్యానని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని, సమస్యలను అనేకసార్లు జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లామని, దాన్ని బాగుచేసేందుకు వారెవరూ పట్టించుకోలేదని తెలిపారు. కనీసం క్షేత్రస్థాయి సమస్యలను కూడా పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
గిరిధర్ గమాంగ్ ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ఆయనతోపాటు కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి సైతం బీఆర్ఎస్ లోకి రానున్నారు. ఇప్పటికే గిరిధర్, ఆయన కుమారుడు శిశిర్ ఈ నెల 13న హైదరాబాద్‌కు వచ్చి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న స్పష్టత, దేశంలో గుణాత్మక మార్పు కోసం ఆయన పడుతున్న తపన, ముందుచూపుతో కూడిన ప్రణాళిక వంటివి గిరిధర్ గమాంగ్‌ను విపరీతంగా ఆకర్షించాయి. దీంతో బీఆర్ఎస్లో చేరాలని, సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు.
గిరిజన నేత అయిన గిరిధర్ గమాంగ్‌కు అపార రాజకీయ అనుభవం ఉన్నది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నుంచి 1972-2004 వరకు వరుసగా కాంగ్రెస్ తరఫున 9 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు ఒడిశా సీఎంగా వ్యవహరించారు. తన పదవికి రాజీనామా చేయకుండానే పార్లమెంట్ ఎంపీగా ఉంటూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. ఆ సమయంలోనే లోక్‌సభలో ఆయన వేసిన ఓటు ఫలితంగానే 13 నెలల వాజపేయి ప్రభుత్వం అప్పట్లో కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను క్రమంగా పకన పెట్టింది. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయన 2015లో కాంగ్రెస్‌ను వదిలి పెట్టి వారిద్దరూ బీజేపీలో చేరారు. అప్పటినుంచి బీజేపీలోనే కొనసాగిన వారు.. బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఒడిశాలో బీఆర్ఎస్తో ఇప్పటికే కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆ రాష్టానికి చెందిన సీనియర్ నేత, ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యదర్శి కైలాశ్‌కుమార్ ముఖి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. దేశాన్ని నడిపించే రాజనీతిజ్ఞత, సామర్థ్యం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను ప్రగతిశీల దేశంగా మార్చగలిగే సత్తా కేసీఆర్‌కు ఉందని, అందుకే ఆయనతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్టు స్పష్టంచేశారు. ఇప్పుడు గిరిధర్ గమాంగ్, ఆయన కొడుకు శిశిర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరాం పాంగి బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో రానున్న కాలంలో ఒడిశాలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదుగనున్నది.