మణికొండ, ఏప్రిల్ 1: నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. కత్తులతో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ఆదివారం సరుకుల కోసం దుకాణం వద్దకు వచ్చిన బాలికను వేధించారు. ఇదేం పద్ధతని నిలదీసిన బాలిక తండ్రి గొంతుకోసి చంపేందుకు యత్నించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ నెమలినగర్ ప్రాంతానికి చెందిన నయికి రాముడు తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం రాముడు కూతురును సరుకుల కోసం కిరాణా దుకాణానికి పంపాడు. దుకాణం వద్ద ఉన్న సురేశ్ అనే యువకుడు బాలికను వేధించాడు. పక్కనే మోరీలోని వ్యర్థాలను ఆమెపై వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి రాముడు సురేశ్‌తో వాదనకు దిగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సురేశ్‌తోపాటు అతడి స్నేహితులు రాముడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో రాముడు భార్యకు గాయాలయ్యాయి. ఈ విషయమై బాధితులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సురేశ్, అతడి అన్న ప్రవీణ్ దుకాణం వద్ద రాముడి గొంతును కోసి పరారయ్యారు. ప్రస్తుతం రాముడి పరిస్థితి విషమంగా ఉన్నది. నార్సింగి పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.