హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): విద్యారంగం అధునాతన టెక్నాలజీ అందిపుచ్చుకొని విజయం సాధిస్తున్నదని రాష్ట్ర సాంకేతక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ చెప్పారు. టెక్నాలజీపరంగా పదేండ్ల విద్యాభివృద్ధి కొవిడ్ కారణంగా 21 నెలల్లోనే జరిగిందని అన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, సంయుక్త ఆధ్వర్యంలో అత్తాపూర్‌లోని ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్సీలో మంగళవారం ‘ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్-19 ఆన్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో విద్యారంగం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నదని చెప్పారు. బోధనతోపాటు ఆన్లైన్లో పరీక్షలు కూడా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. క్రియేట్ కంటెంట్ నుంచి క్యూరేటింగ్ కంటెంట్ వీడియోలు తయారుచేసే దిశగా టీచింగ్ ఫ్యాకల్టీ ఆలోచించాలని సూచించారు. క్రక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్‌సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు భారీ జీతం వచ్చే ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని, వచ్చే పదేండ్లలో సాధించాల్సిన విజయాల గురించి ఆలోచనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జెర్మంటెన్ హాస్పిటల్స్ (హైదరాబాద్) సీఎండీ డాక్టర్ మీర్జావెద్ జార్ఖాన్, డాక్టర్ ఖాన్, ఐసీబీఎం డైరెక్టర్ డాక్టర్ జరార్, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.