హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో అడ్వైర్టెజ్‌మెంట్ మాఫియా బరి తెగించింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ నిబంధనలను తుంగలో తొక్కి కొందరు బడాబాబులు అక్రమ ప్రకటనల దందాకు తెరలేపారు. ఎటువంటి టెండర్లు లేవు. కనీస అనుమతులు లేవు. కానీ, నగరం నడిబొడ్డున అత్యంత కీలకమైన వీవీఐపీ కారిడార్‌లో కాసుల వర్షం కురుస్తున్నది. జీహెచ్ఎంసీ ఖజానాను ‘టార్గెట్’ చేసిన ‘ముఖ్య’నేత సోదరుడు కేబీఆర్ పార్కు కేంద్రంగా అక్రమంగా లాలిపాప్ బోర్డు (రోడ్డు మధ్యలో లైటింగ్‌లో ఉండేవి)లతో ఏటా రూ.7.2 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు టెండరేశారు. బహిరంగంగా జరుగుతున్న ఈ అక్రమ ప్రకటనల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతున్నది.
వాస్తవానికి, కేబీఆర్ పార్కు చుట్టూ దాదాపు 300 లాలిపాప్ బోర్డులను అంతకుముందున్న ప్రైవేట్ ఏజెన్సీల నుంచి స్వాధీనం చేసుకొన్నామని, ఇక మీదట తామే స్వయంగా జీహెచ్ఎంసీ సారథ్యంలో ప్రకటనలకు అవకాశం ఇచ్చి సదరు వ్యాపారులు ఇచ్చే ప్రకటనల ఫీజులతో సంస్థ ఖజానాను బలోపేతం చేస్తామని సంబంధిత లాలిపాప్స్పై బహిరంగ ప్రకటనలు చేశారు. కానీ, వారం వ్యవధిలోనే సదరు ముఖ్యనేత సోదరుడు అధికారులపై ఒత్తిడి పెంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని లాలిపాప్స్‌తో కమర్షియల్ వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నాడు. రాజకీయ పరపతిని ఉపయోగించి ఈ బోర్డులను కైవసం చేసుకొని, ఒక్కో బోర్డు ద్వారా నెలకు రూ.20 వేల చొప్పున అన్నీ కలిపి రూ.60 లక్షల మేర జీహెచ్ఎంసీ ఆదాయానికి గండికొడుతూ తన జేబులు నింపుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన సంబంధిత అధికారులను బదిలీ చేస్తారనే టాక్ వినిపిస్తున్నది. తక్షణమే సంబంధిత లాలిపాప్ ప్రకటన బోర్డులకు టెండర్లు పిలువాలని, అక్రమ దందాపై విచారణ జరిపి, ఖజానాకు జరిగిన నష్టాన్ని సదరు వ్యక్తి నుంచి వసూలు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.