హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు సర్వే నంబర్లు మార్చేసి 47 అంతస్థులతో కూడిన ఎనిమిది భవనాలను కడుతున్నారని తెలుపుతూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే చర్యలు శూన్యమని, అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఐటీ కారిడార్‌లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నం 27లో 27.18 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల వశం అయ్యిందని, సుమారు రూ.5 వేల కోట్ల విలువైన ఆ భూమిలో బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మురళీనాయక్ భూక్యా, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి సంయుక్తంగా దాఖలు చేసిన పిల్‌పై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది చికుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. 1955- 58 కాస్రా పహాణిలో (పాత సర్వే నం. 117/3/1) సర్వే నం 27లోని 27.18 ఎకరాల భూమి ప్రభుత్వ పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉందని తెలిపారు. అయితే, సర్వే నంబర్లను మార్చేసి భూమిని కాజేశారని చెప్పారు. ట్రస్టీగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం వల్లే కోట్ల రూపాయల ఆస్తిని కాపాడాలన్న మహత్తర సంకల్పంతో పిటిషనర్లు పిల్ దాఖలు చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. వినతిపత్రంలో సర్వే నంబర్ లేదని చెప్పింది. ఏది అక్రమ నిర్మాణమో, ఏ ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. మీరు కనీసం ఆ గ్రామానికి చెందిన వారు కాదు, వినతిపత్రం సరిగ్గా ఉండాలి అని తేల్చి చెప్పింది. దీనిపై న్యాయవాది కల్పించుకుని, ప్రభుత్వ భూమిని రక్షించాలన్నదే తమ ఉద్దేశమని, ప్రభుత్వమే తన భూమిని రక్షించకపోతే ఎలాగంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు.. సర్వే నంబర్ ఇతర వివరాలతో వినతిపత్రం అధికారులకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
సర్వే నంబర్ మార్చి అక్రమ నిర్మాణాలు
సర్వే నంబర్ 119, 122 (పాతవి) భూమికి చెందిన సర్వే నంబర్‌ను తప్పుగా నమోదు చేస్తూ 1995 జనవరి 30న ప్రొసీడింగ్స్ (నం డి1/6770/1993) ఇచ్చారని పిటిషనర్ చెప్పారు. సర్వే నం బర్ 27లో 27.18 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకుగా అధికారులు తేల్చారని, కాస్రా పహాణి 1955- 58 (పాత సర్వే నం 117/3/1) సర్వే నం 27లోని 27.18 ఎకరాల భూమిని ప్రభుత్వ పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉందన్నారు. సర్వే నంబరు మార్పు చేసి ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు తమ స్వాధీనంలోకి తెచ్చుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని చెప్పారు. సర్వే నంబరు మార్చారని, రంగారెడ్డి కలెక్టర్ ఎన్వోసీ జారీతో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చేసిందని చెప్పారు. ఈ అక్రమాలపై పూర్తి వివరాలతో అధికారులకు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
1996లో పహాణి ప్రకారం కూడా 27.18 ఎకరాల భూమి ప్రభుత్వ పోరంబోకు అని చెప్పారు. అయితే, ఈ భూమిని పల్లవి (భర్త కొమురయ్య)-మలాజిగిరి, బెవర్లీ హిల్స్ యజమానుల సంక్షేమ సంఘ సభ్యులకు బదిలీ చేశారని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారని చెప్పారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 24న జీపీఏ హోల్డర్ రంగంలోకి వచ్చారని, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సోహిని బిల్డర్స్ -జూబ్లీహిల్స్ జీపీఏ తీసుకుని ప్రభుత్వ భూమిలో 47 అంతస్థులతో ఎనిమిది టవర్లు నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. పనులు వేగంగా జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇదే భూమిలో ఖాజాగూడ చెరువు కూడా ఉందని, సమీపంలోనే ఓక్రిడ్జ్ సూల్కు 150 మీటర్ల దూరంలో రెడీమిక్స్ యూనిట్ ఏర్పాటు చేశారని తెలిపారు.
ఆ ప్రాంతంలో బిల్డింగ్ నిర్మాణ పనులకు చెందిన కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్ పెట్టి కాలుష్యానికి తెర తీశారని ఆరోపించారు. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పనులు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చే చర్యలు ఉన్నా అధికారులు స్పందించడం లేదన్నారు. తెలంగాణ రెవెన్యూ చట్టం- 1371ఎఫ్ నిబంధనను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని 14, 21, 300ఏ ఉల్లంఘన కూడా ఉందని, జీహెచ్ఎంసీ యాక్ట్-1955 ఉల్లంఘన అవుతున్నదని చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేలొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో విన్నవించారు.
వివరాల్లేకుండా వినతి పత్రమా?
వినతి పత్రంలో సర్వే నంబర్ వివరాలు లేకుండా ఇస్తే ఎలాగని పిటిషనైర్లెన ఎమ్మెల్యేలను హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్, గచ్చిబౌలి ప్రాంతంలోని భూమి అంటే ఎక్కడ అని అడిగింది. గచ్చిబౌలి అంటే చాలా విస్తీర్ణం ఉంటుందని, ఆఫీసర్లు ఎకడికి వెళ్లి అక్రమ నిర్మాణాలు పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించింది. ఫలానా ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నారని తెలియజేయకపోతే ఆఫీసర్లు ఎలా చర్యలు తీసుకోగలరని ప్రశ్నించింది. భూమి సర్వే నంబర్ లేకుండా వినతిపత్రం ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముటుందని వ్యాఖ్యానించింది. సర్వే నంబర్‌తో సమగ్ర వివరాలతో సంబంధిత ఆఫీసర్లుకు తాజాగా వినతి సమర్పించాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.