చిక్కడపల్లి, జూన్ 12: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా ఫాలోవర్స్‌పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు లలితారెడ్డి, జక్కుల లక్ష్మణ్ ఆరోపించారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ఉన్న కొణతం దిలీప్‌పై ఆర్టీసీ ఫేక్ లోగో విషయంపై చిక్కడపల్లి ఠాణాలో కేసు నమోదుచేశారు.
ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ కాపీని న్యాయవాదులు సీఐ సీతయ్యకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది లలితారెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్ ఫిర్యాదు మేరకు నిజాలు తెలుసుకోకుండా కొణతం దిలీప్‌పై కేసు నమోదు చేశారని తెలిపారు. దిలీప్ ఆ లోగోను క్రియేట్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారని, ఆరోపణలో నిజం లేదని తేలిందని పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాగే దిలీప్‌పై, బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. న్యాయవాది జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ.. పోలీసుల దర్యాప్తులో ఆర్టీసీ లోగోను దిలీప్ క్రియేట్ చేసినట్టుగానీ, పోస్టు చేసినట్టుగానీ తేలలేదని స్పష్టంచేశారు.