హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): దేశ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కోర్ ఇంజినీరింగ్ కోర్సులు అవసరమని.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కోర్సులను విద్యాసంస్థలు కొనసాగించాలని ఐఐటీ తిరుపతి వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులకు ప్రస్తుతం డిమాండ్ ఉన్నా, కొంతకాలానికి ఇప్పుడున్న డిమాండ్ ఉండకపోవచ్చని విశ్లేషించారు. ఒకే కోర్సు పట్ల విద్యార్థులు ఆకర్షితులవడం అంతమంచిది కాదని అన్నారు. కందిలోని ఐఐటీహెచ్‌లో నిర్వహించిన ‘ఇన్వెంటివ్-24’లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేఎన్ సత్యనారాయణ ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు నేపథ్యం ఉన్న ఆయన ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తిచేసి, అమెరికాలో ఎంఎస్, పీహెచ్డీ చేశారు. ఐఐటీ మద్రాస్‌లో ప్రొఫెసర్‌గా చేరి, ప్రస్తుతం ఐఐటీ తిరుపతి వ్యవస్థాపక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
దేశంలో తయారీరంగం వేగంగా పెరుగుతున్నది. దేశాభివృద్ధికి ఈ రంగమే కీలకం. భవిష్యత్తులో ఈ రంగంలోనే అత్యధిక ప్రాజెక్టులు రాబోతున్నాయి. దేశ జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 17 శాతంగా ఉన్నది. దీన్ని 2025 నాటికి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇన్ఫ్రా, మాన్యుఫాక్చరింగ్ రంగంలో పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే ఈ రంగంలో ఇంజినీర్లకు మరింత డిమాండ్ పెరగబోతున్నది. కాబట్టి కోర్ కోర్సులను కొనసాగించాలి.
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ బూమ్ అధికంగా ఉన్నది. దీంతో కాలేజీలు సీఎస్ఈ కోర్సుల సీట్లను పెంచుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బూమ్‌కు ప్రైవేట్ కాలేజీలు ఒక కారణం అయితే, తల్లిదండ్రులు మరో కారణం. పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులే సీఎస్ఈ కోర్సులోకి నెడుతున్నారు. దీన్ని గమనించే ఐఐటీలు సీఎస్ఈ కోర్సుల్లో సీట్లను పెంచుకోవడంలేదని అంతా గ్రహించాలి. అంతా సీఎస్ఈ కోర్సునే ఎంచుకునే వైఖరి మంచిది కాదు. ఒకేసారి సీఎస్ఈ ఇంజినీర్లంతా మార్కెట్లోకి వస్తే పరిస్థితి ఏంటి? అందరికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితులుంటాయా? రాబోయే రోజుల్లో దేశానికి ఇదో పెద్ద సవాల్. ఇప్పటి నుంచే జాగ్రత్త పడటం అవసరం. సీఎస్ఈ వాటికి ప్రారంభ వేతనాలు భారీగా ఉంటున్నాయి. దాంతో అంతా సీఎస్ఈ వెంట పడుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీల హవాతో కంప్యూటర్ సైన్స్‌లో అనేక మార్పులు రాబోతున్నాయి. ఒక రకంగా సీఎస్ఈకి ఏఐ సవాల్ విసరబోతున్నది. చాలా మంది కోడింగ్‌ను కంప్యూటర్ సైన్స్ కోర్సుగా భావిస్తున్నారు. కోడింగ్ కంప్యూటర్ సైన్స్‌లో ఒక భాగం మాత్రమే. ఏఐ, చాట్‌జీపీటీతో ఈ ఉద్యోగాల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశాలు ఉన్నాయి.