హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టిసారించాలని పలువురు వక్తలు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో సమతుల్యత అవసరమని, అవి రెండు జోడెడ్లలాగా సాగితేనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంక్లూజివ్ గవర్నమెంట్ హైదరాబాద్ (ఐఐజీహెచ్) ఆధ్వర్యంలో శనివారం బేగంపేట సెస్ భవనంలో ‘తెలంగాణలో పరిపాలన మెరుగుపర్చడం-ఆర్థిక నిర్వహణ- సంక్షేమ పాలన’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి చిట్టెడి, ఐఐజీహెచ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, విశ్లేషకుడు సురేశ్ కొల్చాటి, న్యాయవాది బండారు రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.