ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 2: ఎస్కిమోలు నివసించే ఇండ్ల తరహాలో ప్రస్తుతం పట్టణాల్లో ఇగ్లూ థియేటర్ ట్రెండ్ నడుస్తున్నది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్లో సరికొత్తగా ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఇగ్లూ థియేటర్ పనులు వేగంగా సాగుతున్నాయి. విలాసవంతమైన సౌకర్యాలతో ప్రేక్షకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. డిజైన్ నుంచి సౌండ్ సిస్టం వరకు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మల్టీప్లెక్స్, సినీమ్యాక్స్ థియేటర్లను తలదన్నేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. కేవలం వంద సీట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.కోటి వెచ్చిస్తున్నారు. 2 నెలల్లో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నది. రోజుకు ఐదు షోలు నడుపుతామని వారు పేర్కొన్నారు.
ముంగిట్లోకి వినోదం
నిర్మల్ జిల్లాలోని కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల ప్రజలు సినిమాలు చూడాలంటే పెద్ద పెద్ద పట్టణాలకు పోవాల్సి వస్తున్నది. ప్రజలకు వినోదాన్ని ముంగిట్లోకి తెచ్చేందుకు మాకు దగ్గరగా ఇగ్లూ థియేటర్ కట్టడం ఆనందంగా ఉన్నది.
– మహిపాల్, సూర్జాపూర్ గ్రామస్థుడు