
తల్లిదండ్రుల చెంతకు 1,546 మంది
ముమ్మరంగా కొనసాగుతున్న ఆపరేషన్ స్మైల్
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులతోపాటు ఇటుకబట్టీలు ఇతర కర్మాగారాల్లో వెట్టి చాకిరీ చేస్తున్న బాలకార్మికుల జాడ కనిపెట్టేందుకు ప్రభుత్వ శాఖలతో కలిసి పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్-8 ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ నెల 1 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,801 మంది చిన్నారుల (1,472 మంది బాలురు, 329 మంది బాలికలు) జాడను గుర్తించినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అధికారులు వెల్లడించారు. వీరిలో 1278 మంది తెలంగాణకు, 523 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు ఉన్నట్టు తెలిపారు. గుర్తించిన చిన్నారుల్లో 1,546 మందిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని, మరో 255 మందిని షెల్టర్ హోంలకు తరలించామని వివరించారు.
