హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : పెద్దపిల్లి జాతుల సంరక్షణపై రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. భారత విదేశాంగ శాఖతో కలిసి ఈనెల 11, 12 తేదీల్లో ఐబీసీఏ(ఇంటర్నేషనల్ బిగ్‌క్యాట్ అలయన్స్) సదస్సు నిర్వహించనున్నది. పులులు, చిరుత పులుల సంరక్షణ చర్యలపై ఈ కార్యక్రమం కొనసాగనున్నది. పులి, సింహం, జాగ్వార్, చిరుత, స్నోలియోపార్డ్, చీతా, ప్యూమా తదితర పెద్ద పిల్లి జాతుల సంరక్షణలో అంతర్జాతీయ సహకారం, వన్యప్రాణి ఆవాసాల పరిరక్షణ, జీవవైవిధ్య రక్షణ తదితర అంశాలపై చర్చలు జరుగనున్నాయి.
ప్రకృతి సంరక్షణ ఆధారిత అభివృద్ధి, జీవవైవిధ్య పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వ కట్టుబాట్లను ఈ కార్యక్రమం ప్రతిబింబించనుందని అటవీ దళాల అధిపతి డాక్టర్ సువర్ణ తెలిపారు. మొదటి రోజు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో నిర్వహించనున్న ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మంత్రి కొండా సురేఖ హాజరుకానున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ చర్యలు, ఆవాసాల నిర్వహణ విధానాలను రెండోరోజు విదేశీ ప్రతినిధులు పరిశీలించనున్నారు. సదస్సుకు ఫ్రాన్స్, మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, టరీ దేశాల ప్రతినిధులతోపాటు హైదరాబాద్‌లోని కాన్సుల్ జనరల్స్, దౌత్యవేత్తలను ఆహ్వానించినట్లు డాక్టర్ సువర్ణ వెల్లడించారు.