హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సత్యం కంప్యూటర్స్ కంపెనీ లిమిటెడ్ ఆదాయపు పన్ను (2002- 2008కి సంబంధించి) మదింపు ప్రక్రియను తిరిగి ప్రారంభించలేమని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్యాక్స్ (సీబీడీటీ) హైకోర్టుకు తెలిపింది. టెక్‌మహీంద్ర కోరిన విధంగా తిరిగి పన్ను మదింపు చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. 2002- 2008 మధ్య సత్యం కంపెనీ లేని ఆదాయంపై పన్ను విధింపును పునఃసమీక్షించాలని టెక్ మహీంద్ర కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని జస్టిస్ శ్యాంకోశీ, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సత్యం కంపెనీ అక్రమాల్లో కూరుకుపోవడంతో దానిని కేంద్రప్రభుత్వ ఆదేశాలతో మహీంద్ర కంపెనీ స్వాధీనం చేసుకుంది. పన్ను విధింపును పునఃసమీక్ష చేయాలంటూ టెక్ మహేంద్ర కంపెనీ వేసిన పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా పడింది.