జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 13: వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని తమకు కోర్టు ఆదేశాలు అందలేదని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి వెల్లడించారు. జ్యోతిష్యుడు వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి 17 ఎంఎం కోర్టు ఆదేశించినట్టు వచ్చిన వార్తలపై ఏసీపీ స్పందించారు. జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని, ఇటీవల ప్రధాని ఫొటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించినట్టు పిటిషన్లు వేశారు. వీటిని వెలుగులోకి తెచ్చిన మీడియాను టార్గెట్ చేశాడన్న కేసు విచారణలో పిటిషనర్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినట్టు తెలిసింది.
హైదరాబాద్‌లో ప్రణామ్ హాస్పిటల్
హైదరాబాద్, సెప్టెంబర్ 13: ప్రముఖ వైద్య సేవల సంస్థ ప్రణామ్ హాస్పిట్స్…హైదరాబాద్‌తోపాటు వైజాగ్‌లలో దవాఖానాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిని ఏర్పాటు చేయడానికి మేక్ ఇన్ ఇండియా హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడానికి ముఖ్యంగా ఇన్నోవేషన్, ఎక్సలెన్స్, మెడికల్ విభాగంలో తనదైన గుర్తింపు సాధించడానికి కృత నిశ్చయంతో ఉన్నది. ఈ సందర్భంగా ప్రణామ్ హాస్పిటల్స్ ఎండీ మనీష్ గౌర్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా హాస్పిటల్స్‌తో కలిసి నూతన జర్నీని ప్రారంభించినట్లు, దీంతో తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదన్నారు. సరసమైన ధరలకే హెల్త్‌కేర్, మెడికల్ సర్వీసులు అందించడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు.
లారస్ ప్లాంట్‌లో అమెరికా తనిఖీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 13: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్నకు చెందిన ప్లాంట్‌లో అమెరికా నియంత్రణ మండలి తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌కు సమీపంలోని శామీర్‌పేట్‌లోని జినోమ్ వ్యాలీలో కంపెనీకి ఉన్న ఏపీఐ తయారీ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ అధికారులు ఆడిట్ నిర్వహించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని వెల్లడించింది.