హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైడ్రా పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు మాత్రమేనని, హైడ్రా పేదల ఇండ్ల జోలికి పోదని, నివాసం ఉండే ఇండ్లను కూల్చేయదంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా వరుసగా ట్వీట్లు చేశారు. మూసీ నదికి ఇరువైపులా కొనసాగుతున్న సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని పేర్కొన్నారు.
నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లపై హైడ్రా మార్కింగ్ చేయలేదని స్పష్టంచేశారు. మూసీ పరిధిలో నివసిస్తున్న వారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. మూసీ సుందరీకరణను మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతున్నదని వివరించారు.
ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం హైడ్రా బాధ్యత అని తెలిపారు. కాగా ఇప్పటివరకు క్లారిటీ లేకుండా ఎందుకు దూకుడుగా వ్యవహరించారని నెటిజన్లు హైడ్రా కమిషనర్‌పై మండిపడుతున్నారు.