హైదరాబాద్: హైడ్రా (HYDRA) అధికారులు మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పారు. అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో (Alwal Lake) ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. గురువారం ఉదయాన్నే బుల్డోజర్లు, ఎక్స్కావేటర్లతో చిన్నరాయుని చెరువు వద్దకు చేరిన హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే మూడు భవన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు, హ్రైడా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడ మోహరించారు. ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు.
44 ఏండ్ల క్రితం.. అల్వాల్ చెరువు ప్రస్తుతం
కాగా, నిజాం కాలంలో 20 ఎకరాల పైచిలుకు విస్తరించిన అల్వాల్ చెరువు.. ఇప్పుడు తొమ్మిదెకరాలకు పరిమితమైపోయింది. మానవ నిర్మితమైన ఈ చెరువు.. ఒకప్పుడు పశువులు, పక్షులకు ఆవాసంగా.. తాగునీటి అవసరాలు తీర్చే కల్పతరువుగా ఉండేది. ఇప్పుడు తన ప్రాశస్త్యాన్ని, ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తోంది. గృహ సంబంధ వ్యర్థాలు, కాలుష్యకారకాలు పెరిగి.. చెరువు మొత్తం మురికికూపంగా మారిపోయింది. ఆక్రమణలతో కుచించుకుపోయింది.