హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైడ్రా బాధితులపై మరో పిడుగు పడింది. బుల్డోజర్లతో కూల్చివేసిన ఇండ్ల తాలూకు శిథిలాలను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవన యజమానులకు ఆదేశాలు జారీచేశారు. ఒకవేళ తరలించకుంటే సంస్థ తరపున ఆ ప్రక్రియ చేపట్టి, అందుకు అయ్యే వ్యయాన్ని యజమానుల నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం హైడ్రా తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. నిజాంపేట పరిధిలోని ఎర్రకుంట కూల్చివేతల వద్ద తాజా విధానాన్ని అమలు చేశారు. అందులో భాగంగా బాధితులకు నోటీసులు కూడా జారీచేశారు. ఇప్పటికే కూల్చివేతలతో కుమిలిపోతున్న బాధితులు హైడ్రా నోటీసులతో లబోదిబోమంటున్నారు.
ఎర్రకుంటలో మొదలైంది..
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మాణాలు చేపట్టారని అనేక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. భవనాలను కూల్చివేసిన తర్వాత శిథిలాలు అక్కడే ఉన్నాయి. కాగా, చెరువుల సుందరీకరణ పనులు మొదలుపెట్టేందుకు హైడ్రా ప్రణాళిక రూపొందించగా.. ఆ మేరకు శిథిలాలను తరలించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా తొలుత నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట శిథిలాల తరలింపు ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే, శిథిలాల తరలింపునకు అయ్యే ఖర్చును భవనాల యజమానులే చెల్లించాలని హైడ్రా స్పష్టం చేస్తున్నది. శిథిలాల తరలింపు పనులను టెండర్ ద్వారా ఓ సంస్థకు అప్పగించింది. శిథిలాల్లో టన్నుల కొద్దీ తుక్కు ఉన్న దరిమిలా దానిని వేలం వేసి వచ్చే మొత్తాన్ని శిథిలాల తరలింపునకు వినియోగిస్తుంది. కాగా, తరలింపునకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుండటంతో వేలంలో వచ్చిన మొత్తం మినహాయించి మిగిలిన డబ్బులను చెల్లించాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఎంచుకొని ఈ ప్రక్రియను అమలు చేసేందుకు హైడ్రా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
తరలించకుంటే చర్యలే..:రంగనాథ్, హైడ్రా కమిషనర్
హైడ్రా కూల్చివేతల అనంతరం నిర్మాణ వ్యర్థాలను సదరు యజమానులే తొలగించాలని, లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వ్యర్థాలను తొలగించేందుకు ఖర్చులు చెల్లించకపోతే తుక్కు, ఇనుప చువ్వలను విక్రయించగా వచ్చిన డబ్బులు పోను మిగతా డబ్బులు కచ్చితంగా యజమానులే చెల్లించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చామని, కొందరు తొలగిస్తుంటే మరికొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. కూల్చివేతల ప్రాంతాన్ని పూర్వస్థితికి తీసుకురావాల్సిన బాధ్యత యజమానిపైనే ఉంటుందని రంగనాథ్ స్పష్టంచేశారు.
ఐరన్ తరలింపు, అమ్మకం వాస్తవమే..!
ఎర్రకుంట చెరువులో హైడ్రా కూల్చేసిన భవనాల్లోని ఇనుమును తరలిస్తున్నారంటూ బిల్డర్ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన నేపథ్యంలో రంగనాథ్ వివరణ ఇచ్చారు. సుధాకర్‌రెడ్డి అనే బిల్డర్ ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఐదంతస్థులవి మూడు భవనాలను నిర్మించారని, అతనిపై ఇరిగేషన్ అధికారులు బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారని తెలిపారు. భవనాల వ్యర్థాలను తొలగించాలని హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత విలువైన వస్తువులను తీసుకెళ్లి భవన వ్యర్థాలను అక్కడే వదిలేశారని వివరించారు.