హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థి సత్తాచాటాడు. నగర విద్యార్థి హేరంబ్ మహేశ్వరి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. నవంబర్‌లో నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్ విద్యార్థి హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ ఓస్వాల్ ఆర్ సైతం 84.67శాతం స్కోర్‌తో ఆలిండియా టాపర్లుగా నిలిచారు. అహ్మదాబాద్ విద్యార్థి రియా కుంజాకుమారి రెండోర్యాంకు, కోల్‌కత్తాకు చెందిన కింజల్ ఆజ్మీరా మూడో ర్యాంకు సాధించారు. ఈ ఏడాది సీఏ గ్రూప్-1కు 66,987 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 11,253 మంది (16.8శాతం)పాసయ్యారు. ఇక సీఏ గ్రూప్-2కు 49,459 మందికి 10,566 మంది అభ్యర్థులు (21.36శాతం) ఉత్తీర్ణత సాధించారు. రెండింటికి 30,763 మంది పరీక్ష రాస్తే 4,134(13.44శాతం) మంది పాసయ్యారు.