హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న ఒక మహిళకు యశోద హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్సతో డిస్క్ సరిచేసి బాధ నుంచి ఉపశమనం కలిగించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ ఫాతిమా కొంతకాలంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నది. సాధారణ నొప్పిగా భావించి పలు రకాల పెయిన్‌కిల్లర్ మందులు వాడినా ఫలితం లభించలేదు.
సమస్య మరింత తీవ్రమై బాధితురాలు కనీసం లేచి, నడవలేని స్థితికి చేరుకున్నది. దీంతో ఆమె యశోద దవాఖానలో చేరింది. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రోగికి ‘ఎల్5-ఎస్1 ఇన్ఫెక్టివ్ స్పాండిలోడిస్కిటిస్’ సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. రోగికి శస్త్రచికిత్స జరిపి విజయవంతంగా డిస్క్‌ను సరిచేసినట్టు సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ వంశీకృష్ణవర్మ పెన్మెత్స తెలిపారు. ఈ సర్జరీ వల్ల రోగికి పొంచి ఉన్న పక్షవాతం ముప్పు నుంచి విముక్తి కలిగినట్టు వివరించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని శస్త్రచికిత్స జరిగిన మూడు రోజుల్లోనే దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు.