హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆడిపాడే వయసులోనే ఆ చిన్నారులు అనంత విశ్వాన్ని ఔపోసన పట్టారు. మహామహా పరిశోధకులకే సాధ్యంకాని రహస్యాలను ఛేదించి ఔరా అనిపించారు. హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన అన్నదమ్ములు మోరపాక అభిరామ్, మోరపాక విశ్వక్సేన సౌరకుటుంబంలో రెండు కొత్త గ్రహ శకలాలను గుర్తించారు. నిజాంపేటలోని రవీంద్రభారతి పాఠశాలలో అభిరామ్ 7వ తరగతి, విశ్వక్సేన 4వ తరగతి చదువుతున్నాడు. స్పేస్‌పోర్ట్ ఇండియా సంస్థ అంతరిక్షరంగంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు నాసా శాటిలైట్ టెలిస్కోప్ ఆధారంగా కొన్ని వీడియోలను వీరికి పంపింది. ఇంట్లోని ల్యాప్‌టాప్‌తోనే లైవ్ వీడియోలపై గంటల తరబడి పరిశోధనలు జరిపి కొత్తగా రెండు గ్రహశకలాలను గుర్తించారు. వాటిని పరిశీలించిన ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబరేషన్, అవి గతంలో ఎవరూ కనిపెట్టనివిగా నిర్ధారించి ప్రశంసా పత్రాలు అందజేశాయి.