Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించింది. విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ సర్వేలైన్స్ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలవగా.. ఉత్తమ 50 నగరాల్లో భారత్ నుంచి ఢిల్లీ (22వ స్థానం)తోపాటు హైదరాబాద్ 41వ స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను రూపొందించిన ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ… తాజా జాబితాను ఎక్స్ (ట్విట్టర్)లో విడుదల చేసింది. జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్కు ఉత్తమ స్థానం దక్కింది.
హైదరాబాద్లో 5 లక్షల సీసీ కెమెరాలు
1.6 చదరపు కిలోమీటర్ల పరిధిలో 321 సీసీ కెమెరాలు హైదరాబాద్ నగరంలో కలిగి ఉన్నాయి. ఇక ఢిల్లీ 1,490 కెమెరాలను కలిగి 22 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 62 శాతం హైదరాబాద్ నగరంలో ఉన్నట్లుగా పలు అధ్యయనాల్లో తేలింది. నగరం వ్యాప్తంగా సుమారు 5 లక్షల సీసీ కెమెరాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయగా… వీటి నిర్వహణ, పర్యవేక్షణ, మరమ్మత్తుల కోసం క్యామో (కెమెరా మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్) విభాగాన్ని ఏర్పాటు చేసి నగరంలో సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ఉత్తమ పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన 100 నగరాల జాబితాలో టాప్ 50లో భారత్ నుంచి రెండే నగరాలకు చోటు దక్కింది. ఇక హైదరాబాద్ తర్వాత మాస్కో, న్యూయార్క్, మెక్సికో, బ్యాంకాక్, లండన్, ఢాకా, లాస్ ఏంజిల్స్, బెర్లిన్, జోహెన్స్ బర్గ్, ప్యారిస్, సిడ్నీ, ఇస్తాంబుల్ వంటి నగరాలు నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 54 శాతం సీసీ కెమెరాలు ఒక్క చైనాలోనే ఉండగా, మిగిలిన 46 శాతం కెమెరాలు 150కిపైగా దేశాలు కలిగి ఉన్నట్టుగా పలు అధ్యయనంలో వెల్లడైంది.
P