హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రం వివక్షకు అద్దం పట్టే ఉదంతాలు చాలా ఉన్నాయి. అందులో హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో(2014) టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. దీనిపై ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉన్నా కేంద్రం నుంచి మాత్రం ఉలుకు లేదు, పలుకు లేదు. గత సెప్టెంబర్‌లో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. లిఖితపూర్వక వినతి పత్రంలోనూ పేర్కొన్నారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ కారిడాన్‌ను ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. నాగ్‌పూర్ ఇప్పటికే మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్‌గా అభివృద్ధి చెందింది. ఐటీ, ఫార్మా రంగాలకు హబ్‌గా హైదరాబాద్ విరాజిల్లుతున్నది. ఈ రెండు నగరాల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే మెదక్ (కొంత భాగం), నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. కారిడార్ దారికి ఇరువైపులా 50 కిలోమీటర్ల పరిధిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కేంద్రాన్ని కోరింది. కారిడార్‌లో భాగంగా రవాణా, రైలు, విమాన సౌకర్యాలను మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సమగ్ర నివేదికను అందించింది. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (585 కిలోమీటర్లు) తరహాలో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. కేంద్రం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నది.