హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్, సృజనాత్మకత, డిఫెన్స్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ లాంటి రంగాల్లో అపారమైన సేవలు అందించినందుకు పలువురు అసాధారణ వ్యక్తులు, సంస్థలను హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) తన వార్షిక అవార్డుల కార్యక్రమంలో సతరించింది. ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ మారిగోల్డ్ వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవన సాఫల్య అవార్డును రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆవుల భరత్ భూషణ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును శరత్ చంద్ర మారోజు, ‘బెస్ట్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్వస్తవ క్యాన్సర్ కేర్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ వాసుదేవ్ చతుర్వేది గెలుచుకున్నారు.
ఫిన్ టెక్ కంపెనీల్లో ఒకటైన జాగిల్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ రాజ్ పీ నారాయణకు ‘ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2024-25’ అవార్డు అందించారు. చిన్న తరహా వ్యాపారవేత్తల్లో పోచంపల్లికి చెందిన యువ వ్యాపారవేత్త చిట్టిమళ్ల పండును గుర్తించడం ఈ కార్యక్రమంలో ఒక స్ఫూర్తిదాయకమైన అంశంగా నిలిచింది. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యూహాత్మక ఆలోచనల నిపుణుడు, రిటైర్డ్ కమాండర్ మాధవరావు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్ఎంఏ అధ్యక్షుడు కే చంద్రశేఖర్, కార్యదర్శి అల్వాల దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.