హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): జుబ్లీహిల్స్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఇన్నోవా కారులో జరిగినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఘటనలో మరో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో సాదుద్దీన్ మాలిక్‌తో పాటు ముగ్గురు జువైనల్స్ అరెస్టయ్యారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఉమేర్‌ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇన్నోవాతో పాటు బెంజ్ కారులో పలు ఆధారాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. బెంజ్‌కారులో మహిళల పెద్ద వెంట్రుకలు, షటిల్ కాక్, టేప్, శానిటైజర్లు, మాస్కులు, మహిళకు సంబంధించిన చెప్పులు స్వాధీనం చేసుకొన్నారు. ఇన్నోవా కారులో లైంగిక దాడికి పాల్పడినప్పుడు సీట్లపై ఏర్పడ్డ మరకలు, పలు నమూనాలు సేకరించారు. పొడవాటి వెంట్రుకలు, సీట్లపై చేతి వేలి ముద్రలు, డోర్లపై ఉన్న వేలిముద్రలను తీసుకొన్నారు.
నిందితులది రాజకీయ కుటుంబ నేపథ్యం
నిందితుల్లో ఒకరు మినహా మిగతావారికి రాజకీయ కుటుంబాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఒక నిందితుడు ఆటో డ్రైవర్ కొడుకు కాగా, మరో నిందితుడు ప్రభుత్వ సంస్థ చైర్మన్ కొడుకు, ఇంకో నిందితుడు సంగారెడ్డికి చెందిన ప్రజాప్రతినిధి కొడుకు, పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్‌కు కుటుంబానికీ రాజకీయ సంబంధాలు ఉన్నా యి. బషీర్‌బాగ్‌లోని ఒక పాత థియేటర్ యజమాని మనుమ డే ఉమేర్‌ఖాన్. వీళ్లది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే.
ఆధారాలు మాయం చేసేందుకు యూట్యూబ్ పాఠాలు
నిందితులు యూట్యూబ్‌లో శృంగారానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసినట్టు తెలిసింది. ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలా తప్పించుకోవాలన్నదాని కోసం కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందని తెలియగానే ఇన్నోవా కారును మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌కు తరలించారు. కారును అక్కడికి తరలించాలని సూచించింది ప్రభుత్వ సంస్థ చైర్మనేనని తెలిసింది. నిందితులు నగరంలో లేనట్టు, ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు కొత్త సిమ్‌లతో పోలీసులను ఎలా తప్పుదారి పట్టించాలన్నది కూడా యూట్యూబ్‌లో చూశారు. పాతబస్తీకి చెందిన ఓ కార్పొరేటర్ వీరిని తప్పించేందుకు సహకారం అందించినట్టు గుర్తించిన పోలీసులు.. సదరు కార్పొరేటర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
సోషల్ మీడియాలో బాధితురాలి మరిన్ని వీడియోలు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం బాధితురాలి వీడియోలు మీడియాకు విడుదల చేయగా, ఆదివారం మరికొన్ని వీడియోలు బయటకు రావటం కలకలం రేపుతున్నది. బెంజ్‌కారులో నలుగురు యువకులతో కలిసి బాధితురాలు సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోల్లో బాధితురాలితో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే కొడుకును కూడా ఆరో నిందితుడిగా చేర్చేందుకు పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే లైంగికదాడి వీడియోలు, ఫొటోలు తీసి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయాలని ప్లాన్ చేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా, ఆ వీడియోలను స్నేహితులతో పంచుకొన్నట్టు తెలిసింది.