సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును సైతం వెనక్కి నెడుతూ ఐటీ రంగంలో నువ్వా నేనా అన్నట్లుగా హైదరాబాద్ పోటీ పడుతున్నది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ తీసుకున్న చొరవతో దేశ, విదేశాలకు చెందిన ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు గత పదేండ్ల కాలంలో వేల కోట్ల పెట్టుబడులతో నగరానికి వచ్చాయి. వాటి ద్వారానే లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం షాన్ హైదరాబాద్ అన్న పేరును నిలబెట్టుకుంటున్నది.
…?శేఖర్ బరిగెల
Hyderabad | ఐటీ, బీటీ, ఇంజినీరింగ్ పరిశ్రమ లంటే ఒకప్పుడు బెంగళూరుకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. వరల్డ్ టాప్ టెన్‌లో ఉండే అన్ని కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్… ఇలా ఐటీ రంగంలోని కంపెనీలే కాకుండా బయోటెక్నా లజీ, ఫార్మా, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్అండ్డీ రంగాల్లో ఉన్న కంపెనీలు హైదరాబాద్‌లో వాలిపోయాయి. అమెరికా, ఇతర దేశాల్లోని కంపెనీల ప్రధాన కార్యాలయాల తర్వాత వాటి అతి పెద్ద కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
మసకబారుతున్న బెంగళూరు ప్రతిష్ట
మొన్నటి వరకు ఐటీ, బీటీ రంగా లకు క్యాపిటల్ సిటీగా పేరు తెచ్చుకున్న గార్డెన్ సిటీ బెంగ ళూరు ప్రతిష్ట మసకబా రుతున్నది. ఏదోఒక వివాదం అక్కడ అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నది. ఒకప్పుడు బెంగళూరు ఎంతో బాగుండేది అనేవారే ఇప్పుడు తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకు డిజిటల్ సేవలు అందించే ఖాతా బుక్ సంస్థ వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్ చేసిన ఒక ఎక్స్ (ట్వీట్) ఉదాహరణ గా చెప్పవచ్చు. ‘కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా బెంగళూరులోని స్టార్టప్ కంపెనీలకు తిప్పలు తప్పడం లేదు’.. అని రవీశ్ నరేశ్ ట్వీట్ చేశారు.
ఇండియన్ సిలికాన్ వ్యాలీలో గతుకుల రోడ్లు, పవర్ కట్స్, అస్తవ్యస్తమైన నీటి సరఫరా, నడిచేందుకు ఉపయోగపడని ఫుట్‌పాత్‌లు ఉన్నాయని వాపోయాడు. ‘బెంగళూరుతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యా లున్నాయ’ంటూ సోషల్ మీడియా వేదికగా బెంగళూరు పరిస్థితులపై తన అభిప్రా యాన్ని పేర్కొన్నారు. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు… ఎంతో మంది బెంగళూరు పరిస్థితిపై మండిప డుతూ హైదరాబాద్ అభివృద్ధి అద్భుతంగా ఉందంటూ మాట్లాడుతు న్నారు. దీనికి కారణం గత 9 ఏండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం హైదరా బాద్ మహానగరాభివృద్ధికి తీసుకున్న కార్యాచరణే.
మౌలిక వసతులకు సర్కారు పెద్దపీట
మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ శాంతిభద్రత లకు అధిక ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన వ్యవస్థ లను తీర్చిదిద్దింది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా మంచినీరు, విద్యుత్ వంటి అంశాల్లో ఎంతో ముందుచూపుతో సీఎం కేసీఆర్ 50 ఏండ్ల అవస రాలే లక్ష్యంగా వాటిని సమకూర్చారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ రెండు దఫాలు తీసుకున్న నిర్ణయాలు ఐటీ రంగానికి మరెప్పటికీ డోకా లేదన్నట్లుగా మారింది.
బయో ఏసియా సదస్సు మన దగ్గరే…
ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను నిర్వహిస్తుండగా, ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెన్ రంగాల్లోని ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడి తమ ఆర్అండ్డీ కేంద్రాలతోపాటు తయారీ కేంద్రా లను ఏర్పాటు చేస్తున్నారు. కొన్నేండ్లుగా బయో ఏసియా సదస్సును నగరంలోనే నిర్వహిస్తు న్నది. వివిధ దేశాల ప్రముఖ కంపెనీల నుంచి హాజరవుతున్న ప్రతినిధు లకు ఇక్కడి అనుకూ లతలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సా హకాలను వివరిస్తు న్నారు.
రెండు నగరాల మధ్య పోలికతో ఫ్యాన్ వార్…
విశ్వనగరిగా హైదరాబాద్ అంతర్జాతీయ కంపెనీలను ఆకట్టుకుంటున్నది. దీనికి కారణం ఆయా కంపెనీలకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉండడమే. ఇది బెంగళూరులో తగ్గుతూ వస్తుండడం, హైదరాబాద్‌లో పెరుగుతుండడంతో రెండు నగరాల మధ్య బెంగళూరు-హైదరాబాద్ మధ్య డెవలప్మెంట్ ఫైట్ మొదలయ్యింది. సినిమా హీరోల తరఫున ఫ్యాన్స్ తారస్థాయిలో రెచ్చిపోతుంటారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరుల మధ్య ఫ్యాన్ వార్ సోషల్ మీడియా వేదికగా జోరుగా నడుస్తున్నది. హైదరాబాద్ గొప్పతనాన్ని చారిత్రాత్మకంగా, ఐటీపరంగా, అభివృద్ధి పరంగా వివరిస్తూ, ఐటీ కారిడార్‌లో ఆకాశ హర్యాలను, విశాలమైన రోడ్లను పోస్టు చేస్తున్నారు.
దేశంలోనే మొదటి పవర్ ఐలాండ్‌గా హైదరాబాద్
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని పలు నగరాల పరిస్థితిని అంచనా వేస్తే… కేరళలో విద్యుత్ సరఫరా వ్యవస్థ చాలా ఘోరంగా ఉందని చెబుతారు. ఐటీ రాజధానిగా పిలువబడు తున్న బెంగళూరు మహా నగరం ప్రస్తుతం సరైన కరెంటు సరఫరా వ్యవస్థ, సరిపడా సబ్స్టేషన్ల సామర్థ్యం లేక అవస్థలు పడుతున్నది. తమిళనాడులో డిమాండ్-సరఫరా బొటాబొటీగా ఉన్నది. హైదరాబాద్ మెట్రో నగరం పరిస్థితి వీటన్నింటికీ భిన్నం. ఇక్కడ ప్రస్తుతం పీక్ కరెంటు డిమాండు 3400 మెగావాట్లు కాగా… ఇప్పటికిప్పుడు ఆరు వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే సామర్థ్యం హైదరాబాద్ ఐలాండ్ పరిధిలో అందుబాటులో ఉన్నది. వీటన్నింటికీ మించి భారతదేశ గ్రిడ్ వైఫల్యం చెందినప్పటికీ హైదరాబాద్ పవర్ ఐలాండ్ స్వతంత్రంగా పని చేసేలా సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖాధికారులు రూపొందించారు.
ఆఫీస్ స్పేస్‌లో అగ్ర స్థానం…
హైదరాబాద్‌లో మెరుగైన మౌలిక వసతులు, అందుబాటులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నివాసయోగ్యంగా ఉండడం, అత్యంత అనుకూలమైన ప్రభుత్వ విధానాలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో అగ్రస్థానానికి చేర్చుతున్నాయి. ఇప్పటి వరకు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో అగ్ర స్థానంలో ఉండే బెంగళూరును మించి వృద్ధి రేటును కనబరుస్తున్నది హైదరాబాద్. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో వ్యాపార, వాణిజ్య సముదాయాల ఏర్పాటు మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ విభాగంలోనూ హైదరాబాద్ నగరం 2014 నుంచి ఇప్పటి వరకు 48 శాతం వృద్ధిని కనబర్చిందని రియల్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా…
ప్రస్తుతం బెంగళూరులో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అదే హైదరాబాద్ నగరంలో దానికి పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు 9 ఏండ్లలోనే 35 వరకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, 135కు పైగా లింకు రోడ్లను నిర్మించారు. మరికొన్ని లింకురోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. ఐటీ కారిడార్ కేంద్రంగా సుమారు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తుండగా, వారంతా సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థలతోపాటు విశాలమైన కొత్త లింకు రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తమ గమ్యస్థానాలకు సాఫీగా చేరుకుంటున్నారు.
‘షాన్హైదరాబాద్’ కీలక అంశాలివే…
ఐటీ, ఐటీఈఎస్ రంగంలో బెంగళూరుతో హైదరాబాద్‌కు పోటీ ఉన్నా, ఇక్కడున్న మౌలిక వస తులు కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెట్రో రైలు నగరంలోని నలు దిక్కుల నుంచి ఐటీ కారిడార్‌తో అనుసంధానమై ఉన్నది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఐటీ ఉద్యోగులు నిమిషాల వ్యవధిలోనే ఐటీ కార్యాలయాలకు మెట్రో రైలు ద్వారా చేరుకుంటు న్నారు. మరో ప్రధాన అంశం ఔటర్ రింగ్ రోడ్డు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కి.మీ ఉన్న ఓఆర్ఆర్ అంత ర్జాతీయ ప్రమాణాలతో 8 వరుసల ప్రధాన రహదారి, ఇరువైపులా సర్వీసు రోడ్లు ఉండడంతో రవాణా పరంగా ఎంతో అనుకూలంగా ఉన్నది.
కోర్ సిటీ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తమ గమ్య స్థానాలకు సులభంగా చేరుకుంటు న్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు గ్రేటర్ హైదరాబాద్ నలుదిక్కులా కావాల్సి న భూమి అందుబాటులో ఉంది. దీంతో పరిశ్రమలు, నివాస ప్రాంతా లు ఏర్పాటయ్యేందుకు అనుకూలం గా మారింది. వీటికి తోడు దేశం లోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు అందుబాటులో ఉన్నాయి.
దీంతో రియ ల్ ఎస్టేట్ కంపెనీ లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. వ్యాపార రంగాల వారీగా హైదరాబా ద్లో పలు ప్రాం తాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో (సీబీడీ)లో బేగంపేట, సోమాజి గూడ, రాజ్‌భవన్ రోడ్డు, ఎస్పీ రోడ్డు ప్రాంతాలు ఉన్నాయి. సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్ విభాగంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు ఉండగా, పెరిపెరల్ బిజినెస్ డిస్ట్రిక్‌లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, కోకాపేట, పుప్పాల గూడ, మణికొండ, పోచారం, ఉప్పల్, శంషాబాద్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇలా ఎన్నో అనుకూల తలు హైదరాబాద్‌ను బెంగళూరు కంటే ఎంతో మెరుగైందని అనిపించేలా చేస్తున్నాయి.
గ్లోబల్ కార్యకలాపాలకు కేంద్రంగా…
ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నాయి. ఐటీ రంగంలో సూపర్ పవర్‌గా మారిన హైదరాబాద్ క్రమంగా వివిధ రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి అంశంలోనూ అగ్ర స్థానానికి చేరుకుంటున్నది. ఇటీవల అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్ తాజా నివేదికే అందుకు నిదర్శనం. హైదరాబాద్ మహా నగరం ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉందని ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్ తన నివేదికలో వెల్లడించింది.