DCP Chaitanya | సుల్తాన్ బజార్,అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మొబైల్ స్నాచింగ్‌కు యత్నించి పారిపోతున్న దొంగలను సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి కాల్పులు జరిపి పట్టుకున్న సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్పై ప్రశంసలు కురుస్తున్నాయి. చాదర్‌ఘాట్ సమీపంలోని పాతబస్తీ కామాటిపురం ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు, రౌడీషీటర్, మొబైల్ స్నాచర్ మహ్మద్ ఒమర్ అన్సారీ (28), మరో మొబైల్ స్నాచర్‌తో కలిసి శనివారం సాయంత్రం చాదర్‌ఘాట్ వద్ద మొబైల్ చోరీ చేశాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న డీసీపీ చైతన్యకుమార్ వారిని గమనించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ దొంగ కత్తితో దాడి చేయడంతో డీసీపీ, గన్‌మన్ కిందపడ్డారు. ఇదే అదునుగా స్నాచర్లు అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని ఇసామియా బజార్ టెలివిజన్ గల్లీలోకి పారిపోయారు.
అక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఓ భవనంపైకి ఎక్కి విక్టోరియా ప్లే గ్రౌండ్లోకి దూకే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన డీసీపీ వారిని ఛేజ్ చేశారు. గన్‌మన్ వద్దనున్న తుపాకి తీసుకుని దొంగలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒమర్ అన్సారీ చేయి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. దీంతో అతడు తప్పించుకునే క్రమంలో విక్టోరియా గ్రౌండ్లోకి దూకాడు. మరో దొంగ తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలతో కిందపడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. కాగా, దొంగతో జరిగిన పెనుగులాటలో డీసీపీ మెడ, కాలి భాగంలో స్వల్పంగా గాయాలయ్యాయి. మరోవైపు, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డీసీపీ చైతన్య, గన్‌మన్, నిందితుడు అన్సారీని చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
ఆత్మరక్షణ కోసమే కాల్పులు: సజ్జనార్
తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు డీసీపీ, గన్‌మన్‌పై కత్తితో దాడికి దిగారని, ఈ క్రమంలో గన్‌మన్ కిందపడటంతో ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ చైతన్య కాల్పులు జరిపారని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పాత నేరస్థుడు అన్సారీపై ఇప్పటికే 25 కేసులు ఉన్నాయని, రెండుసార్లు పీడీయాక్ట్‌లు నమోదయ్యాయని తెలిపారు. నాలుగేండ్ల క్రితం రెండేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించినట్టు పేర్కొన్నారు. పరారైన మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు చెప్పారు. మహ్మద్ ఉమర్ అన్సారీపై ఉన్న కేసులు, అతడికి సహకరిస్తున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీసీపీ, గన్‌మన్ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.