కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు
కేటీఆర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయరాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లను సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
- బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌కు కోర్టు ఆదేశాలు
- వివాదాస్పద వీడియోలు, వార్తా కథనాలు తొలగించాలని మీడియా సంస్థలకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆర్డర్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయరాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లను సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఇప్పటికే వివిధ టెలివిజన్ చానళ్లు, వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచురించిన, ప్రసారం చేసిన వివాదాస్పద వీడియోలు, ఇంటర్వ్యూలు, రికార్డింగులు, ప్రకటనలు, పోస్టులు, వార్తా కథనాలను తొలగించాలని ఆదేశించింది.
ఈ మేరకు కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో కోర్టు బుధవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేటీఆర్ పరువుకు నష్టం కలిగించే అంశాలతో కూడిన కంటెంట్‌ను తిరిగి సృష్టించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, షేర్ చేయడం లేదా ఇతర మార్గాల్లో వ్యాప్తి చేయడం నిలిపివేయాలని స్పష్టంచేసింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి తనపై నిరాధార ఆరోపణలు చేయడం, హీరోయిన్లతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటూ తప్పుడు అభియోగాలు మోపడం ద్వారా తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని పేర్కొంటూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.
2014 నుంచి 2023 వరకు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠతోపాటు కుటుంబ గౌరవానికి కూడా నష్టం కలుగుతున్నదని పేర్కొన్నారు. తన ప్రత్యర్థుల వ్యాఖ్యలు.. వీడియోలు, ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు, వార్తా కథనాల రూపంలో ప్రచారమవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేటీఆర్ తరఫున న్యాయవాది పీ విశ్వజనని వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ పరువు, ప్రతిష్ఠలకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రచారం జరగకుండా శాశ్వత నిషేధాజ్ఞలు విధించాలని కోరారు. మన తొలివెలుగు టీవీ, ఏబీఎన్ తెలుగు, వాహిని టీవీ తదితర మీడియా సంస్థలతోపాటు డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన, ప్రచురితమైన వివాదాస్పద కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన వీడియోల స్క్రీన్షాట్లు, వార్తల క్లిప్పింగ్‌లను కోర్టుకు సమర్పించారు.
వాటిని పరిశీలించిన కోర్టు, ప్రాథమికంగా కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని భావించి మధ్యంతర రక్షణ కల్పించింది. వివాదాస్పద కంటెంట్ కొనసాగితే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ప్రతివాదులు, వారి తరఫున వ్యవహరించే ఉద్యోగులు, ఏజెంట్లు, ప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులు సంబంధిత కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడం, తిరిగి వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ దాఖలైన ప్రధాన దావాపై తదుపరి విచారణను డిసెంబరు 28కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

