కవాడిగూడ, డిసెంబర్ 18: పుస్తకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ శుక్రవారం ఘనంగా ప్రారంభం కానున్నదని బుక్‌ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకుబ్ వెల్లడించారు. ఈనెల 19 నుంచి 29వరకు సాగే ఈ పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ కళాభారతిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని చెప్పారు.
పుస్తక పఠనాన్ని ప్రజల్లోకి, సాహిత్యకారుల్లోకి తీసుకెళ్లేందుకు పుస్తక ప్రదర్శన ప్రాంగణంలోనే పుస్తక స్ఫూర్తి పైలాన్‌ను జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, కే రామచంద్రమూర్తి, రమా మెల్కోటేలు పాల్గొంటారని వివరించారు. ప్రజాకవి అందెశ్రీ పేరును 38వ బుక్‌ఫెయిర్ ప్రాంగణానికి నామకరణం చేసినట్టు వెల్లడించారు. అనిశెట్టి రజిత పేరును ప్రధాన వేదికకు, సాహితీవేత్త కొంపల్లి వెంకట్‌గౌడ్ పేరును పుస్తకావిష్కరణల వేదికకు పెట్టామని తెలిపారు. ప్రొఫెసర్ ఎస్వీ రామారావు పేరుతో రైటర్స్స్టాల్, స్వేచ్ఛ ఒటార్కర్ పేరుతో మీడియా స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో మొత్తం 367 స్టాల్స్ ఉంటాయని, ప్రతిరోజూ ఆరు స్ట్లాట్స్లో పుస్తకావిష్కరణలు జరుగుతాయని తెలిపారు. 9తొమ్మిది రోజులపాటు మొత్తం 54 పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని వెల్లడించారు. ఐడీ కార్డులతో బుక్‌ఫెయిర్‌కు వచ్చే విద్యార్థులకు ఉచిత ప్రవేశం ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి ఆర్ వాసు, ఉపాధ్యక్షులు బీ శోభన్‌బాబు, బాల్‌రెడ్డి, కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు కే సూరిబాబు, పీ నారాయణరెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పబ్లికేషన్స్‌కు హైదరాబాద్ బుక్ఫెయిర్లో స్టాల్ కేటాయించకపోవడం అప్రజాస్వామికమని కోయ చంద్రమోహన్ పేర్కొన్నారు. బుక్ఫెయిర్లో తమ పబ్లికేషన్స్‌కు చోటు కల్పించకపోవడపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో చేపట్టిన బుక్ఫెయిర్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు యాకుబ్ నిరంకుశంగా, నియంతృత్వంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రదర్శన నిర్వహణకు అయ్యే నామమాత్రపు రుసుము సొసైటీ వారు ప్రకటించిన తేదీలోపే రూ.33,040 చెల్లించినప్పటికీ స్టాల్ కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కోదండరాం, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, రామచంద్రమూర్తి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.