అసలు ఈటల రాజేందర్ ఎందుకు ఓటేయ్యాలి? ఆత్మగౌరవం అనేది ఎక్కడిది? నీకుండే ఆత్మగౌరవం మాకు ఉండదా? ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలోకి పోయి బై ఎలక్షన్లు తెచ్చినవ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్ను ఎవరు పంపించారు. దళితుల భూములు లాక్కున్నావు. నా దగ్గర దళితుల భూములు ఉన్నాయని నువ్వే చెప్పావు. ఇంక నీకు ఆత్మగౌరవం ఎక్కడిది? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తెచ్చింది. తెలంగాణను అభివృద్ధి చేసింది. పెన్షన్లు ఇచ్చింది. ఇప్పుడు దళిత బంధు ఇస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్నప్పటికీ దళితుల గురించి ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. దళితులు అభివృద్ధి చెందాలని కేసీఆర్ కృషి చేస్తున్నారు.
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఆయన సాయం చేస్తున్నారు. ప్రతీ దళితునికి ఈ పథకాన్ని వర్తింపజేస్తానని చెప్పారు. దళిత బంధు ప్రవేశపెట్టడంతో ఈటల రాజేందర్ కడుపు నొస్తుంది. ఈటల ఖబడ్దార్.. ఇప్పటికైనా నీ వెకిలి చేష్టలు మానుకోకపోతే నీకు ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారు. నీ ఓటమి తథ్యం. నీవు రాసిపెట్టుకో. విభజించు.. పాలించు అనేది ఈటల విధానం. బీసీల ముసుగులో ఉన్న దొరవు నీవు. నీవు ఎవరి గురించి పట్టించుకోలేదు. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కార్యకర్తలను అణగదొక్కినవు. ఈ ఎలక్షన్లతో ఈటల రాజేందర్ రాజకీయ జీవితం సమాధి కావడం ఖాయం. దళితులతో పెట్టుకోవడం మంచిదికాదు. మా కేసీఆర్ దేవుడు. పది లక్షలు ఇస్తానన్న కేసీఆర్‌కు దళితులు వెన్నంటి ఉంటారు. టీఆర్ఎస్ అభ్యర్థికి దళితులందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిస్తరు. – ఇల్లందుల శ్రీనివాస్, జూపాక గ్రామం
ఈటల రాజేందర్ నాయకత్వంలో ఒక్కరూ కూడా బాగుపడలేదు. ఆయనకు ఓటేందుకు వేయాలి. ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల బీజేపీలో చేరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. కేసీఆర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పది లక్షలతో ప్రతి కుటుంబం బాగుపడుతుంది. కష్టాలు కనుమరుగైతయి. అందరిలా ఆర్థికంగా ఎదుగుతాం. ఈటల రాజేందర్‌కు ఓటేసే సమస్య లేనేలేదు. కారు గుర్తుకే ఓటేస్తాం. – మునిగాల సంపత్, జూపాక గ్రామం