కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో రెండో దఫా నామినేషన్ల ముగింపు రోజైన మంగళవారం సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. సమయం సమీపిస్తుండడంతో తమ నామినేషన్ పత్రాలను ముందుగా తీసుకోవాలని అభ్యర్థులు పోటీ పడడంతో కొన్ని నామినేషన్ కేంద్రాలలో గందరగోళం నెలకొంది. సింగోటంలోని నామినేషన్ కేంద్రంలో సింగోటం, యన్మన్ బెట్ల, మాచినేనిపల్లి గ్రామాల నుంచి అభ్యర్థులందరూ నామినేషన్ కేంద్రంలోకి రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
పోలీసులు జోక్యం చేసుకొని అభ్యర్థులు కానివారిని నామినేషన్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. సింగోటం, కుడికిల్ల, ఎల్లూరు, రామాపురం నామినేషన్ కేంద్రాలలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి నెలకొన్నది. పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాల పరిధిలోని నామినేషన్ కేంద్రాలలో కూడా భారీ ఎత్తున అభ్యర్థులు తరలి రావడంతో నామినేషన్ కేంద్రాలన్నీ జనసంచారంతో నిండి ఉన్నాయి. అరకొర బందోబస్తు .. నామినేషన్ కేంద్రాలలో చివరి రోజైన మంగళవారం నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు తమ అనుచరులతో తరలి రావడంతో జన సందోహాన్ని కంట్రోల్ చేసేందుకు సరిపడా బందోబస్తు లేదు.
నామినేషన్ కేంద్రాలలో ఇద్దరు చొప్పున మాత్రమే పోలీస్ బందోబస్తు ఉన్నది. చివరి రోజు నామినేషన్ వేసేందుకు వస్తున్న వారిని పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొన్నది. సమస్యాత్మక సున్నితమైన గ్రామాలలో సైతం సరిపడా బందోబస్తు లేకపోవడం విడ్డూరంగా ఉంది. నామినేషన్ కేంద్రాలలో నామినేషన్ల ప్రక్రియ వరకు కొనసాగే అవకాశం ఉన్నది.