మహదేవపూర్ (కాళేశ్వరం), మే 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుషరాలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆరో రోజు మంగళవారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకొన్నారు. రద్దీకి అనుగుణంగా అధికారులు వసతులు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరస్వతీ పుషరాల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న గంగారం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్ వడదెబ్బతో మృతి చెందాడు.
మృతదేహాన్ని ధర్మసమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణమూర్తి(66) ఎండ వేడిమికి తాళలేక అస్వస్థతకు గురయ్యాడు. అంబులెన్స్‌లో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సరస్వతీ పుషరాల్లో అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. సరస్వతీ ఘాట్ వద్ద ఇసుకపై నడిచేందుకు మ్యాట్ ఏర్పాటు చేయకపోవడంతో ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డాం. సామాన్య భక్తులను అధికారులు పట్టించుకోవడంలేదు. చలువ పందిళ్లు సరిపడాలేవు.
– సతీశ్ కుమార్, భక్తుడు, జయశంకర్ భూపాలపల్లి