నిజామాబాద్ : తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. పార్టీ శ్రేణులు, రైతులు స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ఆర్మూర్లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో ఆర్మూర్ పురవీధుల్లో ర్యాలీ తీశారు. నల్ల జెండాలు చేతపట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేంద్రం ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని నినదించారు.