హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలపై హ్యుమన్ రైట్స్ కమిషన్ నేడు (సోమవారం) బహిరంగ విచారణ చేపట్టనున్నది. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి వివరాలను తీసుకోనున్నది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర అన్ని గురుకులాల్లో ఏడాదిన్నరగా ఫుడ్పాయిజన్ ఘటనలు పెరగడంతోపాటు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం కూడా ఆందోళన రేకేత్తిస్తున్నది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, మార్చిన టైమ్ టేబుల్ వల్లే ఈ ఘటనలు పెరిగాయని ఇప్పటికే గురుకుల ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై ‘నమస్తే తెలంగాణ’లో “పాపం శైలజ ప్రాణం పోయింది.. గురుకులాల్లో మృత్యుఘోష” పేరిట నిరుడు నవంబర్లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ఆధారంగా మంచిర్యాల జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త నయీం హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల హక్కులను కాపాడాలని కమిషన్ను వేడుకున్నారు. ఆ పిటిషన్పై ఇప్పటికే ఉన్నతాధికారులను వివరాలు కోరిన హెచ్ఆర్సీ.. నేడు బహిరంగ విచారణ చేపట్టనున్నది. ప్రభుత్వ ఉన్నతాధికారులను విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఆదేశించింది.