Arogya Bhadratha | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): పోలీసు కుటుంబాల వైద్యానికి నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షోభ పెడుతున్నది. పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద ఈ నెల 20 నుంచి వైద్యసేవలు అందించబోమని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నెల 6న హెచ్చరించినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 దవాఖానల్లో ఆయా వైద్యసేవలు నిలిచిపోయాయి. రాష్ర్టానికి హోంశాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉండటంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పోలీసు కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన వస్తేనే ఈ పథకంపై పూర్తిస్థాయిలో చర్చలు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. సీఎం తన విదేశీ పర్యటనను ముగించుకొని 24న హైదరాబాద్‌కు వస్తారు. అదేరోజు దీనిపై చర్చిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
ఆర్థికశాఖ దృష్టికి ఆరోగ్య భద్రత సమస్య
పోలీసు ఆరోగ్య భద్రత పథకం సమస్యలు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం సచివాలయంలోనే ఉన్నది. రెండ్రోజులుగా పోలీసు కుటుంబాలకు ఎదురవుతున్న సమస్యలు, వాటి తీవ్రతను పోలీసు ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. కనీసం రూ.వంద కోట్లు అయినా విడుదల చేస్తే, ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్నవారికి వైద్యం నడుస్తుందని అధికారులు చెప్పినట్టు తెలిసింది. అంత డబ్బు ఇప్పటికిప్పుడు విడుదల చేసేందుకు ఆర్థికశాఖ సుముఖంగా లేదని తెలిసింది. సమస్య తీవ్రతను ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క దృష్టికి అధికారులు తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చిన తరువాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్టు సమాచారం.
నిలిచిపోయిన ఆరోగ్య భద్రత సేవలు
తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు, వారి కుటుంబసభ్యులకు వైద్యసేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నగరంలోని రెండు కార్పొరేట్ దవాఖానలు మినహా, మరెక్కడా ఆరోగ్య భద్రతపై అడ్మిషన్స్ నమోదు కాలేదని సమాచారం. డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తామని దవాఖానలు తెగేసి చెప్పడంతో, సుమారు 60 నుంచి 70 కుటుంబాలవారు డబ్బులు కట్టి అడ్మిషన్ తీసుకున్నట్టు సమాచారం. వైద్యసేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పోలీసు ఆరోగ్య భద్రత కార్యాలయానికి బాధిత కుటుంబాల నుంచి ఫోన్‌కాల్స్ తాకిడి పెరిగింది. దీంతో ఎవరికి, ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆరోగ్య భద్రత కార్యదర్శి సతమతమైనట్టు తెలుస్తున్నది. సిబ్బంది సైతం ఒకానొక దశలో సమాధానం చెప్పలేక ఫోన్లు కట్ చేసినట్టు తెలిసింది. కాగా, అప్పటికప్పుడు వైద్యానికి డబ్బు లు దొరక్క కొందరు పోలీసు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘హోం శాఖ మంత్రి ఉంటే.. ఆయనకైనా తమ గోడు చెప్పుకునేవాళ్లం’ అంటూ పోలీసులు, ఇతర అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తక్ష ణం బకాయిలు విడుదలచేయాలని పోలీసు లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
చర్చలు జరుగుతున్నాయి: డీజీపీ
ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో చర్చిస్తున్నదని డీజీపీ జితేందర్ తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్‌హెచ్‌ఏ) పోలీస్ శాఖకు సంబంధించిన ఆరోగ్య భద్రత పథకానికి నగదు రహిత చికిత్స అందిస్తున్నది. ఈ నెల 6న ఆరోగ్య భద్రత లబ్ధిదారులకు నగదు రహిత చికిత్సను ఉపసంహరించుకుంటున్నట్టు అసోసియేషన్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారికి బకాయిలు రాకపోవడంతో భారీ ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. సమస్య తీవ్రతను అంచనా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో చర్చిస్తున్నది. వీలైనంత త్వరగా నిధులు విడుదలచేయాలని ఆశిస్తున్నాం. దీని దృష్ట్యా, సేవలను నిలిపివేసే అవకాశం లేదు. ప్రభుత్వం, పోలీసుశాఖ అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయి. ఏ సిబ్బందీ భయపడాల్సిన అవసరం లేదు. పోలీసుశాఖ, ప్రభుత్వ స్థాయిలోని సీనియర్ నాయకులు నిధుల విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు’ అంటూ డీజీపీ జితేందర్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రకటన రూపంలో వివరణ ఇచ్చారు.