హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల పరిపాలన గ్రూప్-1 అధికారులకు ఇవ్వడం ఏంటీ..? అని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ), తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ), తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-ఎస్ఆర్డీఏ), హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డాయి. ఎయిమ్స్, జిప్మర్, పీజీఐఎంఈఆర్, ఈఎస్ఐలాంటి సంస్థల్లో ఈ విధానం అమల్లో లేదని గుర్తుచేశాయి.
డబ్ల్యూహెచ్వో, సీడీసీల్లో సైతం డాక్టర్ ఆధారిత పాలన సత్ఫలితాలు ఇస్తున్నట్టు వివరించాయి. పరిపాలనను గ్రూప్-1 అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని, సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశాయి. గుర్తింపు పొందిన సం ఘాలను అన్ని కమిటీలు, విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలని కో రాయి. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పునఃసమీక్షించాలని విజ్ఞప్తిచేశాయి.