హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు వెలుగులోకి వచ్చిన క్షణాల్లోనే బీజేపీ సోషల్ మీడియా సైన్యం బాధిత బాలికపైనే పోస్టులతో ఎదురుదాడికి దిగింది. హానీ ట్రాప్ అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. బాధితురాలినే నిందితురాలిగా చేసే కుట్రలు చేసి నీచానికి దిగజారింది.
బాధితురాలిపైనే కేసు నమోదైందని, బండి కొడుకే హనీ ట్రాప్‌కు గురయ్యాడంటూ సోషల్ మీడియా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక బాలికపై బీజేపీ సోషల్‌మీడియా సైన్యం దాడి చేయడాన్ని చూస్తుంటే కొడుకును కాపాడుకోవడం కోసం బండి సంజయ్ ఎంత దూరమైనా వెళ్తున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి చదివిన బాలిక.. కేంద్ర మంత్రి కొడుకును హనీట్రాప్ చేస్తుందా? అని చర్చనీయాంశమైంది. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయంపై పోరాడాల్సిన వారు.. ఒక బాలిక, ఆమె కుటుంబంపై ఇంత కుట్ర చేస్తారా? అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో బాలికకు వ్యతిరేకంగా బండి సంజయ్ అనుచరులు చేస్తున్న అబద్ధపు ప్రచారంపై పెద్ద ఎత్తున సామాన్యులు మండిపడుతున్నారు. బాలికకు తాము అండగా ఉన్నామని ధైర్యం చెబుతున్నారు. ఒక కేంద్ర మంత్రిని ఒక బాలిక ఢీకొడుతున్నదంటూ ఆమె దైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజానీకమంతా తిప్పికొడుతున్నది. బాలిక కుటుంబం వ్యాపారంలో బాగా స్థిరపడ్డవారని, అమ్మాయిని ట్రాప్ చేసిన మంత్రి కొడుకుపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.