చీఫ్ జస్టిస్ కారు ఆపి.. బొకే ఇవ్వడంపై అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ బాబు స్పందించారు. మొదట తాను ఏం తప్పు చేశానో అని భయపడ్డానని అన్నారు. అకస్మాత్తుగా కారు ఆగడం… అందులో నుంచి సీజే దిగి.. తన చేతికి బొకే ఇవ్వడం కలా? నిజమా? అని కొద్ది సేపు షాక్‌లోకి వెళ్లానని అన్నారు. ఆ తర్వాత సీజే తనను అభినందించేందుకే ఆగారని తెలుసుకొని ఎంతో సంతోషపడ్డానని హోంగార్డు అష్రఫ్ అలీ బాబు తెలిపారు. ఏకంగా చీఫ్ జస్టిస్ కారు ఆపి.. తనకు బోకే ఇవ్వడంపై అష్రఫ్ అలీ బాబు ఏమనుకున్నారో ఆయన మాటల్లోనే…..
”బాబుజగ్జీవన్‌రామ్ చౌరస్తాలో నేను విధులు నిర్వహిస్తుంటాను, సీజే ఆ రూట్లో వస్తుండడంతో రూట్ క్లియర్ ఉండేవిధంగా అప్రమత్తంగా ఉంటాం. శుక్రవారం ఆకస్మాత్తుగా చౌరస్తాలో సీజే కారు ఆగింది. ఆయన కారు నెమ్మదవుతుండగానే గుండె దడేలమంటూ.. ఏమి తప్పు జరిగిందోనని భయపడ్డాను. ఆయన నన్ను పిలిచి బొకే ఇవ్వడంతో ఎంతో సంతోష పడ్డాను. డ్యూటీ బాగా చేస్తున్నావు.. అభినందనలంటూ సీజే తనను అభినందించడంతో అప్పటి వరకున్న భయపోయింది. నేనేంది.. నన్ను హైకోర్టు చీప్ జస్టిస్ అభినందించడం ఎంటీ అనే విషయం కొన్ని క్షణాలు అర్ధం కాలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగారు తనను అభినందించడం నాకు, నా కుటుంబానికి ఎంతో ఆనందాన్నిచ్చింది. నేను సుమారు 23 సంవత్సరాలుగా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్నాను, గత రెండున్నరేండ్లుగా ట్రాఫిక్ అబిడ్స్ ఠాణాలో హోంగార్డుగా పనిచేస్తున్నాను. ఈ ఘటన నా జీవితంలో మార్వులేని సంతోషకరమైన ఘటన.” అని హోంగార్డు అష్రఫ్ అలీ బాబు పేర్కొన్నారు.
చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రతి రోజు తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ మీదుగా వెళ్తుంటారు. ఆ సమయంలో అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ అలీ(5066, అబిడ్స్ పీఎస్) విధులు నిర్వర్తిస్తుంటాడు. అష్రఫ్ తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించడాన్ని చీఫ్ జస్టిస్ ప్రతి రోజు గమనించేవారు. ఈ క్రమంలో అతని పనితీరు పట్ల ఆకర్షితులైన సీజే సతీశ్ చంద్ర శర్మ.. శుక్రవారం ఉదయం తన కాన్వాయ్‌ను బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆపారు. హోంగార్డ్ అష్రఫ్ అలీకి పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు. అష్రఫ్ అలీ పనితీరును మెచ్చుకుంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశంసలు కురిపించారు.